కేంద్రంలో ‘ప్రైవేటు’ కార్యదర్శులు

13 Apr, 2019 08:39 IST|Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో సంయుక్త కార్యదర్శిగా సేవలు అందించేందుకు తొలిసారి 9 మంది ప్రైవేటు రంగ నిపుణుల్ని తీసుకున్నారు. ఈ తొమ్మిది మంది పేర్లను యూపీఎస్సీ శుక్రవారం ప్రకటించింది. అమీర్‌దూబే(పౌర విమానయాన శాఖ), అరుణ్‌ గోయల్‌ (వాణిజ్యం), రాజీవ్‌ సక్సేనా(ఆర్థిక వ్యవహారాలు), సుజిత్‌ కుమార్‌ బాజ్‌పేయి(పర్యావరణం అడవులు, వాతావరణ మార్పు), సౌరభ్‌ మిశ్రా (ఆర్థిక సేవలు), దినేశ్‌ దయానంద్‌ జగ్దలే(నూతన, పునరుత్పాదక ఇంధనం), సుమన్‌ ప్రసాద్‌(రోడ్డు రవాణా), భూషణ్‌ కుమార్‌(షిప్పింగ్‌), కొకోలీ ఘోష్‌(వ్యవసాయం, రైతు సంక్షేమం) త్వరలోనే బాధ్యతలు స్వీకరిస్తారని వెల్లడించింది.

నైపుణ్యవంతులైన ప్రైవేటు వ్యక్తుల సేవలను వాడుకునేందుకు కేంద్రం గతేడాది ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రెవిన్యూ, వాణిజ్యం, ఆర్థిక సేవలు, వ్యవసాయం, రోడ్డు రవాణా, షిప్పింగ్‌ సహా పలు శాఖల్లో పనిచేసేందుకు దరఖాస్తులను ఆహ్వానించింది. దీంతో మొత్తం 6,077 మంది దరఖాస్తు చేసుకోగా, వీటిని వడపోసిన యూపీఎస్సీ చివరకు 9 మందిని ఎంపిక చేసింది.   

మరిన్ని వార్తలు