వీలునామా సిద్ధం చేసుకున్న హార్దిక్‌

3 Sep, 2018 04:35 IST|Sakshi

కొనసాగుతున్న దీక్ష

అహ్మదాబాద్‌: పటేళ్లకు రిజర్వేషన్లతోపాటు రైతు రుణమాఫీ చేయాలంటూ పటీదార్‌ ఉద్యమనేత హార్దిక్‌ పటేల్‌ చేస్తున్న అమరణ నిరాహార దీక్షకు ఆదివారంతో 9రోజులు పూర్తయ్యాయి. అతని ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోంది. ఈ నేపథ్యంలోనే హార్దిక్‌ తన ఆస్తులను పంచుతూ వీలునామా రాయడం సంచలనం సృష్టిస్తోంది. హార్దిక్‌ ఖాతాలో రూ.50 వేలున్నాయి. ఇందులో తల్లిదండ్రులకు 20వేలు, పంజ్రపోల్‌ గ్రామంలో ఆవులకు షెడ్‌ కోసం రూ.30వేలు ఇవ్వాలని పేర్కొన్నారు.

‘తన  జీవితగాథపై వస్తున్న పుస్తకం హూ టుక్‌ మై జాబ్‌పై వచ్చే రాయల్టీ, ఇన్సూరెన్స్‌ డబ్బులు, తన కారు అమ్మగా వచ్చిన మొత్తాన్ని తల్లిదండ్రులు, చెల్లెలితోపాటు మూడేళ్ల క్రితం పటీదార్‌ ఉద్యమంలో చనిపోయిన 14 మందికి పటేళ్లకు సమానంగా పంచాలని హార్దిక్‌ పేర్కొన్నారు’ అని పటీదార్‌ సంఘం అధికార ప్రతినిధి మనోజ్‌ పనారా వెల్లడించారు. ఒకవేళ ఈ దీక్షలో తను చనిపోతే.. కళ్లను దానం చేయాలని సూచించారు. వీలునామాలో పేర్కొన్న వివరాల ప్రకారం హార్దిక్‌ ఆస్తిలో 15%తల్లిదండ్రులకు, 15% చెల్లెలికి మిగిలిన 70% 14 మంది పటీదార్లకు చెందుతుంది.

మరిన్ని వార్తలు