16 మందిని మింగిన ‘నిపా’

31 May, 2018 14:42 IST|Sakshi

కోజికోడ్‌, కేరళ : ప్రాణాంతక ‘నిపా’ వైరస్‌ మహమ్మారి కేరళలో మరో ఇద్దరిని బలి తీసుకుంది. దీంతో ఇప్పటివరకూ ‘నిపా’ బారిన పడి మరణించినవారి సంఖ్య 16కు చేరుకుంది. అంతేకాక కోజికోడ్‌కు చెందిన మరో వ్యక్తికి కూడా ‘నిపా’ వైరస్‌ సోకినట్లు వైద్య అధికారులు నిర్ధారించారు. మధుసూధన్‌(56), అకిహిల్‌ కరస్సేరి(28) కోజికోడ్‌లోని మెడికల్‌ కాలేజ్‌ ఆస్సత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మరణించారని వైద్యులు తెలిపారు. ఈ విషయం గురించి ఆస్పత్రి సిబ్బంది ‘చికిత్స ప్రారంభంలో కోలుకున్నట్లే కనిపించారు...కానీ తరువాత పరిస్థితి విషమించడంతో వారు మరణించారు. వీరికి ఈ వైరస్‌ ఆస్పత్రి నుంచే సోకిందన్నా’రు. మరో వ్యక్తికి కూడా నిపా వైరస్‌ సోకినట్లు నిర్ధారణ కావడంతో ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు.

ప్రస్తుతం కోజికోడ్‌ ఆస్పత్రిలో ‘నిపా’ వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయిన వారు ముగ్గురు, వైరస్‌ లక్షణాలు ఉన్న వారు మరో తొమ్మిది మంది ఉన్నారు. ఇదిలా ఉండగా కోల్‌కతాలో మరణించిన సైనికుడు శీను ప్రసాద్‌కు సంబంధించి ఇంకా ఎటువంటి సమాచారం తనకు తెలియదని స్టేట్‌ హెల్త్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఆర్‌ఎల్‌ సరిత తెలిపారు. శీను ప్రసాద్‌.. నిపా వైరస్‌ బారిన పడే మరణించాడనే అనుమానం నేపథ్యంలో  అతని శాంపిల్స్‌ను పూణేలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ(ఎన్‌ఐవీ)కి వ్యాధి నిర్ధారణకు పంపారు. భారతదేశంలో నిపా వైరస్‌ను గుర్తించగల సామర్ధ్యం ఉన్న ఏకైక లాబోరేటరీ ఎన్‌ఐవీలోనే ఉంది.

అయితే బుధవారం మరణించిన అకిహిల్‌ ‘నిపా’ వ్యాప్తి ఉన్న ప్రాంతం వాడు కాదని, కనీసం ఈ మధ్య కాలంలో ఆ ప్రాంతాన్ని కూడా సందర్శించలేదని వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. అయితే అకిహిల్‌ ఈ మధ్యే కొజికోడ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన స్నేహితున్ని చూడడానికి వచ్చాడని అతని బంధువులు తెలిపారు. రుతుపవనాలు సమీపిస్తున్న నేపథ్యంలో వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వైద్యులు. ఇప్పటికే చాలా వరకూ ప్రజలు ఇళ్లు వదిలి బయటకు రావడం లేదు. ప్రభుత్వం వారికి ఇంటి వద్దకే రేషన్‌ సరుకులు పంపిస్తుంది.

మరిన్ని వార్తలు