నీరవ్, చోక్సీల పాస్‌పోర్టులు రద్దు

17 Feb, 2018 02:40 IST|Sakshi
నీరవ్‌ మోదీ, మెహుల్‌ చోక్సీ

వారంలోగా తమ ముందు హాజరుకావాలని ఈడీ సమన్లు

దేశవ్యాప్తంగా కొనసాగిన ఈడీ సోదాలు

మరో 549 కోట్ల విలువైన ఆభరణాలు సీజ్‌ 

ఇంటర్‌పోల్‌ సాయం కోరిన సీబీఐ

మరో 8మంది అధికారుల్ని సస్పెండ్‌ చేసిన పీఎన్‌బీ

న్యూఢిల్లీ: వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ, అతని కుటుంబ సభ్యులు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు(పీఎన్‌బీ)ను రూ. 11,400 కోట్ల మేర మోసగించిన కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థలు శుక్రవారం తనిఖీలు కొనసాగించాయి. ఈ దాడుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) రూ. 549 కోట్ల విలువైన ఆభరణాల్ని స్వాధీనం చేసుకుంది. ఈడీ సలహా మేరకు నీరవ్, చోక్సీల పాస్‌పోర్టుల్ని విదేశాంగ శాఖ 4 వారాల పాటు రద్దు చేసింది.

వారంలోగా తమ ముందు హాజరుకావాలని ఆదేశిస్తూ వారిద్దరికీ మనీ ల్యాండరింగ్‌ నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ) కింద ఈడీ సమన్లు జారీ చేసింది. నీరవ్, చోక్సీలు దేశం విడిచి పారిపోవడంతో.. ఆ ఇద్దరి కంపెనీల డైరెక్టర్లకు నోటీసులను పంపింది. నీరవ్‌ మోదీ తన పేరు మీదే నగల దుకాణాల్ని నిర్వహిస్తుండగా, గీతాంజలి జెమ్స్‌కు చోక్సీ ప్రమోటర్‌గా ఉన్నారు. మరోవైపు శుక్రవారం ఈడీ ముంబై, ఢిల్లీ, సూరత్, హైదరాబాద్, జైపూర్‌ సహా పలు ప్రాంతాల్లో తనిఖీల్ని కొనసాగించగా, సీబీఐ దేశ వ్యాప్తంగా 6 నగరాల్లోని 26 ప్రాంతాల్లో దాడులు చేసింది. నీరవ్‌ మోదీ కేసులో గురువారం రూ. 5,100 కోట్ల విలువైన వజ్రాలు, విలువైన రాళ్లు, బంగారం స్వాధీనం చేసుకున్న ఈడీ.. వాటి విలువను అంచనావేసే పనిలో ఉంది.  

రూ. 4,886 కోట్ల నష్టం ఫిర్యాదుపై ఎఫ్‌ఐఆర్‌  
పీఎన్‌బీ ఫిర్యాదు మేరకు నీరవ్‌ మోదీ మామ, గీతాంజలి గ్రూపు ప్రమోటర్‌ మెహుల్‌ చోక్సీపై సీబీఐ తాజాగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఫిబ్రవరి 13 నాటి ఫిర్యాదు ఆధారంగా ఈ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. 2017–18లో చోక్సీ కంపెనీకి చెందిన గీతాంజలి జెమ్స్, నక్షత్ర, గిలి కంపెనీలు 143 ఎల్‌వోయూ(లెటర్‌ ఆఫ్‌ అండర్‌ టేకింగ్‌)లతో రూ. 4,886 కోట్ల నష్టం కలిగించారని ఎఫ్‌ఐఆర్‌లో సీబీఐ పేర్కొంది.

ముంబై, పుణే, సూరత్, జైపూర్, హైదరాబాద్, కోయంబత్తూర్‌లోని గీతాంజలి గ్రూపు దుకాణాలు, కార్యాలయాల్లో సీబీఐ తనిఖీలు చేపట్టింది. ‘మెహుల్‌ చోక్సీకి చెందిన గీతాంజలి గ్రూపు కార్యాలయాలు, ఎఫ్‌ఐఆర్‌లోని కంపెనీలకు చెందిన ఇతర డైరెక్టర్లకు చెందిన కార్యాలయాలు, ఇళ్లలో తనిఖీలు చేశాం’ అని సీబీఐ ప్రతినిధి చెప్పారు. నీరవ్, చోక్సీలు ఎక్కడున్నారో తెలుసుకునేందుకు డిఫ్యూజన్‌ నోటీసు జారీ చేయాలని ఇంటర్‌పోల్‌ను సీబీఐ కోరింది. మరోవైపు చోక్సీతో పాటు ఇతరులపై మనీ ల్యాండరింగ్‌ కేసు నమోదు చేసిన ఈడీ... నీరవ్‌కు చెందిన విదేశీ దుకాణాల్లో లావాదేవీలు జరగకుండా నిషేధించింది.   

న్యూయార్క్‌లో నీరవ్‌?
నీరవ్‌ మోదీ, అతని వ్యాపార భాగస్వామి మెహుల్‌ చోక్సీల పాస్‌పోర్టుల్ని విదేశాంగ శాఖ తాత్కాలికంగా నాలుగు వారాల పాటు రద్దు చేసింది. పాస్‌పోర్టుల్ని ఎందుకు రద్దు చేయకూడదో సమాధానం చెప్పేందుకు వారిద్దరికీ వారం గడువు నిచ్చామని ఆ శాఖ తెలిపింది. గడువులోగా వారు స్పందించకపోతే పాస్‌పోర్టుల్ని పూర్తిగా రద్దు చేస్తామని స్పష్టం చేసింది. ప్రస్తుతం నీరవ్‌ న్యూయార్క్‌లో ఉన్నాడంటూ వార్తలొచ్చినా, అతను ఎక్కడున్నాడో తెలియదని విదేశాంగ శాఖ పేర్కొంది.  

మరో 8 మంది పీఎన్‌బీ అధికారులపై వేటు
ఈ కేసుతో ప్రమేయమున్న మరో 8 మంది అధికారుల్ని పీఎన్‌బీ శుక్రవారం సస్పెండ్‌ చేసింది. వీరిలో జనరల్‌ మేనేజర్‌ స్థాయి అధికారి కూడా ఉన్నారని సీనియర్‌ ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు. బుధవారం 10 మంది అధికారుల్ని పీఎన్‌బీ సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇతర బ్యాంకులకు మార్చి 31లోపు బకాయిల్ని పీఎన్‌బీ చెల్లిస్తుందని, అంతర్గత వనరుల నుంచి ఆ బ్యాంకు నిధుల్ని సమకూర్చుకుంటుందని
ఆ అధికారి తెలిపారు.  

ట్విటర్‌ వేదికగా మోదీపై రాహుల్‌ వ్యంగ్యాస్త్రాలు
ప్రధాని మోదీపైనా, కేంద్ర ప్రభుత్వం పైనా కాంగ్రెస్‌ విమర్శల పర్వం కొనసాగించింది. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ట్విటర్‌లో స్పందిస్తూ.. ‘మోసగాడి పలాయన సూత్రం.. ల(మో) + నీ(మో)––– న(మో)తో–––> భా(గో)’ అంటూ "# ModiRobsIndia హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్‌ చేశారు. ‘లలిత్‌ మోదీ, నీరవ్‌ మోదీ... నరేంద్ర మోదీతో పారిపోవడం’ అని అర్థం వచ్చేలా ఈ ట్వీట్‌ ఉంది.  

యూపీఏ కుంభకోణాన్ని బయటపెట్టాం: బీజేపీ
యూపీఏ హయాంలో జరిగిన పీఎన్‌బీ కుంభకోణాన్ని బీజేపీ ప్రభుత్వం బయటపెట్టిందని బీజేపీ సీనియర్‌ నేత, కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ అన్నారు. 2013 సెప్టెంబర్‌ 13వ తేదీన ఢిల్లీలోని నీరవ్‌ మోదీ నగల దుకాణాన్ని అప్పటి ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సందర్శించారని, ఆ మరునాడే మోదీకి అలహాబాద్‌ బ్యాంక్‌ రుణం మంజూరయిందని వెల్లడించారు. ఆ బ్యాంక్‌ డైరెక్టర్లలో ఒకరైన దినేశ్‌ దుబే వ్యతిరేకించినప్పటికీ, యూపీఏ పెద్దల ఒత్తిడితోనే నీరవ్‌ మోదీకి రుణం మంజూరయిందని ఆరోపించారు.

హైదరాబాద్‌లో భారీగా ఆస్తులు
సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ శివారులోని రావిర్యాల సెజ్, పహాడీషరీఫ్‌లోని గీతాంజలి జెమ్స్‌తో పాటు నీరవ్‌కు చెందిన 4 సహచర కంపెనీల్లో ఈడీ శుక్రవారం  సోదాలు చేసింది. ఈ సోదాల్లో వజ్రాలతో పాటు అత్యంత విలువైన తయారీ ముడిసరుకును స్వాధీనం చేసుకుంది. రావిర్యాలలోని సెజ్‌లో గీతాంజలి గ్రూప్‌ చైర్మన్‌ మెహుల్‌ చోక్సీ రూ.500 కోట్లతో వజ్రాభరణాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. దేశవ్యాప్తంగా నీరవ్, చోక్సీలకున్న తయారీ కేంద్రాల్లో హైదరాబాద్‌ కేంద్రమే అతి పెద్దదని ఈడీ అధికారులు తెలిపారు. రావిర్యాల తయారీ యూనిట్‌లో మెషినరీ, వజ్రాభరణాల ముడిసరుకు మొత్తం కలిపి రూ.3వేల కోట్ల విలువైన ఆస్తుల్ని స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ వర్గాల సమాచారం.

కుటుంబసభ్యుల ఆస్తుల అటాచ్‌
నీరవ్‌ మోదీకి ఆదాయపు పన్ను శాఖ గట్టి షాకిచ్చింది. అతని కుటుంబ సభ్యులు, వారి కంపెనీలకు చెందిన 29 ఆస్తులు, 105 బ్యాంకు ఖాతాల్ని తాత్కాలికంగా అటాచ్‌ చేసింది. విదేశాల్లో అక్రమాస్తులు కలిగి ఉన్నందుకు నీరవ్‌పై ఐటీ శాఖ నల్లధన నిరోధక చట్టాన్ని ప్రయోగించింది. ఈ అక్రమాస్తులు సింగపూర్‌లో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ముంబైలోని ప్రత్యేక కోర్టులో నీరవ్‌పై పలు ఐటీ సెక్షన్ల కింద చార్జ్‌షీట్‌ దాఖలు చేసింది.   

                     శుక్రవారం ఢిల్లీలో నీరవ్‌ మోదీ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న కాంగ్రెస్‌ కార్యకర్తలు

మరిన్ని వార్తలు