నిర్భయ కేసు: 20న ఉరి; విడాకులు కోరిన అక్షయ్‌ భార్య

17 Mar, 2020 20:32 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషులకు ఉరి నుంచి తప్పించుకునే మార్గాలు అన్నీ దాదాపుగా మూసుకుపోయాయి. ఈ సమయంలో నిర్భయ దోషుల్లో ఒకరైన అక్షయ్ కుమార్ సింగ్ భార్య పునీత విడాకులు కావాలంటూ మరో పిటిషన్‌ను తెరపైకి తీసుకువచ్చారు. ఈ మేరకు మంగళవారం రోజున ఔరంగాబాద్ ప్యామిలీ కోర్టులో విడాకుల కోరుతూ ఆమె పిటిషన్ దాఖలు చేశారు. ‘‘అత్యాచారం కేసులో నా భర్తను దోషిగా తేల్చి అతనికి ఉరిశిక్ష విధించారు. కానీ నా భర్త నిర్దోషి. రేప్ కేసులో ఉరితీసిన దోషి భార్యగా నేను ఉండాలనుకోవడం లేదు’’ అంటూ ఆమె ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా ఈ పిటిషన్‌ మార్చి 19న విచారణకు రానుంది.

ఈ విషయం గురించి పునీత తరఫు న్యాయవాది ముకేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘హిందూ వివాహ చట్టం 13(2)(11) ప్రకారం కొన్ని ప్రత్యేక కేసుల్లో విడాకులు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఆ ప్రత్యేక కేసుల్లో అత్యాచారం కూడా ఉంది. తన భర్త అత్యాచారం కేసులో దోషి అని తేలితే భార్య విడాకులు తీసుకోవచ్చు’’ అని ఆయన తెలిపారు. అయితే కొందరు న్యాయనిపుణులు ఆమె పిటిషన్‌ను విమర్శిస్తున్నారు. నేరం జరిగిన 8 ఏళ్ల తర్వాత, శిక్ష పడిన చాలా రోజుల తర్వాత విడాకుల పిటిషన్‌ వేస్తే కోర్టు అక్షయ్ కుమార్‌కు కూడా నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని అన్నారు. చదవండి: నేనప్పుడు అసలు ఢిల్లీలో లేను: నిర్భయ దోషి

కాగా, నిర్భయ కేసులో నలుగురు దోషులకు మార్చి 20వ తేదీన ఉరిశిక్ష అమలు చేయాలని పాటియాలా హౌస్ కోర్టు డెత్ వారంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. డిసెంబర్‌ 2012లో వైద్య విద్యార్థినిపై ఆరుగురు వ్యక్తులు అత్యంత దారుణంగా అత్యాచారం చేయగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించింది. ఆరుగురు దోషుల్లో ఒకరు మైనర్ కావడంతో శిక్ష అనుభవించి విడుదల అయ్యాడు. ప్రధాన దోషి రామ్ సింగ్ జైలులో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

ముఖేశ్‌ సింగ్‌ తల్లి విజ్ఞప్తిని తిరస్కరించిన ఎన్‌హెచ్‌ఆర్సీ
నిర్భయ దోషుల్లో ఒకరైన ముఖేశ్‌ సింగ్‌ తల్లి ఉరిశిక్ష అమలుపై జోక్యం చేసుకోవాలని జాతీయ మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే ఈ పిటిషన్‌ను తోసిపుచ్చినట్లు ఎన్‌హెచ్‌ఆర్‌సీ అధికారులు తెలిపారు.  చదవండి: అంతర్జాతీయ కోర్టుకు నిర్భయ దోషులు

మరిన్ని వార్తలు