నిర్భయ కేసులో 'ఐరన్ రాడ్ థియరీ' నిరూపిస్తే 10 లక్షలిస్తా..!!

29 Jul, 2016 18:44 IST|Sakshi
నిర్భయ కేసులో 'ఐరన్ రాడ్ థియరీ' నిరూపిస్తే 10 లక్షలిస్తా..!!

న్యూఢిల్లీః నిర్భయ గ్యాంగ్ రేప్ కేసులో ఢిఫెన్స్ లాయర్ కొత్త వాదనకు తెరతీశారు. నిర్భయ కేసులో నిందితుల తరపున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది ఎంఎల్ శర్మ సంచలన ప్రకటన చేశారు. కేసులో ఐరన్ రాడ్ థియరీని నిరూపిస్తే 10 లక్షలిస్తానంటూ బహుమతిని ప్రకటించారు. బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితులు ఆమె శరీరంలోకి ఇనుపరాడ్ ను దించి, అవయవాలను బయటకు లాగారన్న పోలీసుల వాదదను ఆయన కొట్టిపారేశారు. అదో కట్టు కథ అని, అది నిరూపిస్తే పదిలక్షలు ఇస్తానంటూ న్యాయవాది శర్మ ప్రకటించడం.. కేసు మరో ట్విస్ట్ గా మారింది.

2012 లో దేశ రాజధాని ఢిల్లీతో పాటు ప్రపంచదేశాలను కుదిపేసిన నిర్భయ ఘటనలో విచారణ కొనసాగుతోంది. ఈ కేసు సుప్రీంలో చివరి దశలో ఉండగా... విచారణలో కొత్త మలుపులు చోటుచేసుకుంటున్నాయి.  కదులుతున్న బస్సులోనే 23 ఏళ్ళ ట్రైనీ ఫిజియోథెరపిస్ట్.. నిర్భయపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, ఆమె శరీరంలోకి ఇనుపరాడ్ ను గుచ్చి, అవయవాలను బయటకు లాగారని, తీవ్రమైన గాయాలు అవ్వడంతోనే అనంతరం ఆమె మరణించినట్లు  పోలీసులు కోర్టుకు నివేదించారు. అయితే దీనిపై విచారణ పూర్తి చేసిన ప్రత్యేక కోర్టు నిందితులకు మరణశిక్ష విధించగా, ఢిల్లీ హైకోర్టు సైతం ఆ తీర్పును సమర్థించింది. దీంతో దోషులు సుప్రీంను ఆశ్రయించారు. మొత్తం ఆరుగురు నిందితుల్లో రామ్ సింగ్ అనే వ్యక్తి తీహార్ జైల్లో మూడేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. మరొక నిందితుడు.. జువైనల్ కావడంతో మూడేళ్ల పాటు రిఫామ్ హోమ్ లో ఉంచి, అనంతరం విడుదల చేశారు.

జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ముందు కేసుపై విచారణ జరిగిన అనంతరం.. దోషుల తరపు న్యాయవాది కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. సుప్రీంకోర్టులో దోషుల తరపున వాదించిన అనంతరం బయటకు వచ్చిన న్యాయవాది ఎంఎల్ శర్మ.. ఇనుప రాడ్ థియరీని నిరూపించినవారికి 10 లక్షల బహుమానం ఇస్తానంటూ సంచలన ప్రకటన చేశారు. బాధితురాలు అత్యాచారం అనంతరం ఆసుపత్రిలో పూర్తి స్పృహలో ఉండగానే వాంగ్మూలం ఇచ్చిందని... ఆమె గానీ, ఆమె స్నేహితుడుగానీ ఇనుపరాడ్ అంశాన్ని ఎక్కడా  ప్రస్తావించలేదని అన్నారు. పోలీసులే ఈ కట్టుకథను అల్లినట్లుగా ఆయన ఆరోపించారు. బాధితురాలు చికిత్స పొందిన సింగపూర్ ఆస్పత్రి ఇచ్చిన పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ ప్రకారం బాధితురాలి యుటెరస్ గానీ, ఓవరీస్ గానీ డ్యామేజ్ అయినట్లు ఎక్కడా లేదని న్యాయవాది శర్మ వాదిస్తున్నారు. బాధితురాలి వాంగ్మూలంలో ఇనుపరాడ్ ప్రస్తావన లేకున్నా.. పోలీసుల వాదన ఎలా చేరుస్తారని శర్మ ప్రశ్నించారు. నిర్భయ కేసు నిందితుల్లో ముఖేశ్, పవన్ ల తరపున శర్మ.. సుప్రీంలో వాదనలు వినిపించారు.

మరిన్ని వార్తలు