ఐసీజేను ఆశ్రయించిన నిర్భయ దోషులు!

16 Mar, 2020 19:55 IST|Sakshi

న్యూఢిల్లీ: ఉరిశిక్ష అమలు తేదీ సమీపిస్తున్న వేళ నిర్భయ దోషులు మరోసారి శిక్షను వాయిదా వేసేందుకు పావులు కదుపుతున్నారు. శిక్ష నుంచి తప్పించుకునేందుకు ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మరణశిక్షను నిలుపుదల చేయాలని కోరుతూ ఐసీజేలో ఈ మేరకు దోషులు అక్షయ్‌ సింగ్‌, పవన్‌ గుప్తా, వినయ్‌ శర్మ సోమవారం పిటిషన్‌ దాఖలు చేసినట్లు సమాచారం. నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో మరో దోషి ముఖేశ్‌ సింగ్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసిన నేపథ్యంలో ఈ ముగ్గురు ఐసీజేను ఆశ్రయించడం గమనార్హం. కాగా 2012 డిసెంబర్‌ 16 అర్ధరాత్రి ఢిల్లీలో పారామెడికల్‌ విద్యార్థినిని అత్యంత దారుణంగా హింసించి మరీ ఆరుగురు అత్యాచారానికి పాల్పడిన విషయం విదితమే. అనంతరం ఆమెను, ఆమె స్నేహితుడిని రోడ్డు మీదకు విసిరేశారు. దీనస్థితిలో ప్రాణాల కోసం పోరాడి చివరకు ఆ యువతి సింగపూర్‌లోని ఓ ఆస్పత్రిలో కన్నుమూసింది. (ఇంకా ఏం మిగిలి ఉంది: సుప్రీంకోర్టు)

ఈ క్రమంలో ఆమెకు నిర్భయగా నామకరణం చేసిన పోలీసులు నిందితులు రామ్‌సింగ్‌, అక్షయ్‌, వినయ్‌ శర్మ, పవన్‌, ముఖేశ్, మైనర్ అయిన మరో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు విచారణ అనంతరం రామ్ సింగ్ 2013 మార్చిలో తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకోగా, మరో నిందితుడు మైనర్ కావడంతో మూడేళ్ల శిక్ష తర్వాత విడుదలయ్యాడు(అతనిపై నిఘా కొనసాగుతుంది). అనేక పరిణామాల అనంతరం మిగిలిన నలుగురు దోషులకు సుప్రీంకోర్టు మరణ శిక్ష విధించగా.. అప్పటి నుంచి శిక్ష అమలును వాయిదా వేసేందుకు దోషులు చట్టంలోని వివిధ సెక్షన్లను ఉపయోగించుకుంటూ ఎప్పటికప్పుడు తమను తాము కాపాడుకుంటున్నారు. ఇక మార్చి 20న నలుగురు దోషులను ఉరితీయాలంటూ డెత్‌ వారెంట్లు జారీ అయిన నేపథ్యంలో... తమకు కారుణ్య మరణం ప్రసాదించాలంటూ వారి కుటుంబ సభ్యులు రాష్ట్రపతికి లేఖ రాయడం గమనార్హం.(‘ప్రతీకారమే శక్తికి నిర్వచనం కాదు’)

చదవండి: శరీరమంతా రక్తం.. తల మీద చర్మం ఊడిపోయి

మరిన్ని వార్తలు