ఆఖరి ప్రయత్నం విఫలం; ఇక ఉరే

19 Mar, 2020 23:45 IST|Sakshi

ఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో నిందితులకు మరోసారి ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. ఉరి శిక్ష నుంచి తప్పించుకోవడానికి నిర్భయ నిందితులు చేసిన చివరి ప్రయత్నం కూడా విఫలమైంది. ఢిల్లీ హైకోర్టులో ముగ్గురు దోషులు దాఖలు చేసిన స్టే పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టిపారేసింది. పిటిషన్ దాఖలు చేసిన దోషుల తరపు న్యాయవాది ఏపీ సింగ్‌కి కోర్టు పలు ప్రశ్నలు సంధించింది. 'లిఖితపూర్వక డాక్యుమెంట్ ఏదీ లేదు.. పార్టీల మెమో లేదు,అఫిడవిట్లు లేవు. అసలు ఈ పిటిషన్ దాఖలు చేయడానికి మీకు అనుమతి ఉందా..?' అని కోర్టు ఆయన్ను ప్రశ్నించింది. అయితే కరోనా వైరస్ కారణంగా ఫోటో కాపీలు జతచేయడం సాధ్యపడలేదని ఏపీ సింగ్ బదులిచ్చారు. ఏపీ సింగ్ వాదనపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. (నిర్భయ దోషులకు ఏ అవకాశాలు లేవు: ఢిల్లీ కోర్టు)

'చూడండి కోర్టులు ఎంత విశాల దృక్పథంతో పనిచేస్తున్నాయో.. ఈ ఒక్కరోజే మీరు మూడు కోర్టుల చుట్టూ తిరిగారు. ఈ రాత్రి 10గంటల సమయంలో మీ పిటిషన్‌పై విచారణ జరుపుతున్నాం.. కాబట్టి సాధ్యపడలేదు వంటి మాటలు చెప్పవద్దు' అని కోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు నిర్భయ దోషుల స్టే పిటిషన్ కొట్టివేయడంతో.. పటియాలా హౌజ్ కోర్టు జారీ చేసిన డెత్ వారెంట్ ప్రకారం శుక్రవారం(మార్చి 20) తెల్లవారుజామున ఉరిశిక్ష అమలుకానుంది. అంతకుముందు గురువారం మధ్యాహ్నం దోషుల స్టే పిటిషన్‌ను పటియాలా కోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఆ పిటిషన్‌ను సవాల్ చేస్తూ దోషులు హైకోర్టును ఆశ్రయించారు.
 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు