నిర్భయ కేసు : లాయర్‌కు భారీ జరిమానా..!

19 Dec, 2019 18:20 IST|Sakshi

న్యూఢిల్లీ : నిర్భయ కేసులో దోషిగా తేలిన పవన్‌కుమార్‌ గుప్తా తరపు న్యాయవాది ఏపీ సింగ్‌కు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. తగిన ఆధారాలు సమర్పించకుండా కోర్టు సమయాన్ని వృధా చేశారని పేర్కొంటూ 25 వేల రూపాయల జరిమానా విధించింది. ఏపీ సింగ్‌పై చర్యలు తీసుకోవాలని ఢిల్లీ బార్‌ అసోసియేషన్‌కు ఆదేశాలు జారీ చేసింది. తన క్లైంట్‌ పవన్‌కుమార్‌ నిర్భయ ఘటన జరిగిన సమయంలో (2012, డిసెంబర్ 16) మైనారిటీ (జువైనల్‌) తీరలేదంటూ న్యాయవాది ఏపీ సింగ్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. పవన్‌కుమార్‌ను జువైనల్‌ జస్టిస్‌​ యాక్ట్‌ కింద విచారించాలని పిటిషన్‌లో పేర్కొన్నాడు. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు ఏపీ సింగ్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

సరైన ఆధారాలు చూపకుండా పిటిషన్‌ వేయడం.. విచారణ సమయంలో గైర్హాజరు కావవడంపై మండిపడింది. కోర్టుకు నివేదించిన సాక్ష్యాల ఆధారంగా ఘటన సమయంలో పవన్‌కుమార్‌ జువైనల్‌ కాదని కోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. అదే విధంగా, సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి జువైనల్‌ జస్టిస్‌ యాక్ట్‌ అంశం తమ పరిధిలోకి రాదని కోర్టు తేల్చిచెప్పింది. దోషి మరణ శిక్షను తప్పించాలనే ఉద్దేశంతోనే లాయర్‌ ఏపీ సింగ్‌ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆక్షేపించింది. ఇక నిర్భయ కేసులో మరో దోషి అక్షయ్‌ కుమార్‌ సింగ్‌, తనకు విధించిన మరణ శిక్షను సమీక్షించాలంటూ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేవేసిన విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు