‘ప్రతీకారమే శక్తికి నిర్వచనం కాదు’

16 Mar, 2020 16:54 IST|Sakshi

రాష్ట్రపతికి నిర్భయ దోషుల కుటుంబ సభ్యుల లేఖ

న్యూఢిల్లీ: నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో దోషులుగా ఉన్న ముఖేశ్‌ సింగ్‌, పవన్‌ గుప్తా, వినయ్‌ శర్మ, అక్షయ్‌ ఠాకూర్‌ కుటుంబ సభ్యులు రాష్ట్రప్రతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు ఆదివారం లేఖ రాశారు. తమకు కారుణ్య మరణం ప్రసాదించాలని అభ్యర్థించారు. ‘‘కారుణ్య మరణానికి అనుమతినివ్వాలని మిమ్మల్ని, బాధితురాలి తల్లిదండ్రులను అభ్యర్థిస్తున్నాం. అప్పుడే భవిష్యత్తులో ఇలాంటి నేరాలు జరగవు. అదే విధంగా కోర్టు కూడా ఒకరికి బదులు ఐదుగురు వ్యక్తులను ఉరి తీసే పరిస్థితి రాదు’’ అని లేఖలో పేర్కొన్నారు. అదే విధంగా.. ‘‘మన దేశంలో మహాపాపులను కూడా క్షమించారు. ప్రతీకారమే శక్తికి నిర్వచనం కాదు. క్షమాగుణంలో కూడా శక్తి ఉంటుంది’’ అని అభిప్రాయపడ్డారు. కారుణ్య మరణం కోరిన వాళ్లలో దోషుల తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు, పిల్లలు కూడా ఉన్నారు.(శరీరమంతా రక్తం.. తల మీద చర్మం ఊడిపోయి)

కాగా 2012లో పారా మెడికల్‌ విద్యార్థినిపై కదులుతున్న బస్సులో వినయ్‌ శర్మ, పవన్‌ గుప్తా, అక్షయ్‌ ఠాకూర్‌, ముఖేశ్‌ సింగ్‌ సహా మరో ఇద్దరు అత్యాచారానికి పాల్పడిన విషయం విదితమే. బాధితురాలిపై అత్యంత పాశవికంగా దాడి చేయడంతో ఆమె ప్రాణాలతో పోరాడి చివరకు సింగపూర్‌లోని ఆస్పత్రిలో కన్నుమూసింది. ఈ క్రమంలో అనేక వాయిదాల అనంతరం దోషులకు సుప్రీంకోర్టు ఉరిశిక్ష విధించగా.. శిక్ష అమలులో జాప్యం నెలకొంది. ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడగా.. మార్చి 20న ఉరితీసేందుకు తాజాగా డెత్‌ వారెంట్లు జారీ అయ్యాయి. ఈ క్రమంలో ముఖేశ్‌ సింగ్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించగా సోమవారం అతడి అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది. (ఇంకా ఏం మిగిలి ఉంది: సుప్రీంకోర్టు)
 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా