ఉరి అమలు: ఉదయం 3:30 గంటలకు పిటిషన్‌ కొట్టివేత

20 Mar, 2020 08:44 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించి, ఏడేళ్లుగా నలుగుతున్న నిర్భయ కేసులో బాధితురాలికి ఎట్టకేలకు న్యాయం జరిగింది. దోషులు ముఖేష్‌ సింగ్‌ (32), పవన్‌ గుప్తా (25), వినయ్‌ శర్మ (26), అక్షయ్‌ కుమార్‌ సింగ్‌ (31)ను ఈరోజు (శుక్రవారం) ఉదయం 5:30 గంటలకు తీహార్‌ జైలులో ఉరి తీశారు. అయితే, మరణ దండన నుంచి తప్పించుకునేందుకు న్యాయపరమైన అవకాశాల పేరుతో దోషులు తీవ్ర ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉరి శిక్ష అమలుకు రెండు గంటల ముందు వరకు దోషుల ప్రయత్నాలు ఆగలేదు. ఢిల్లీ హైకోర్టులో అర్ధరాత్రి వరకు వాదనలు కొనసాగాయి. ఉరిపై స్టే ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. దీంతో వారు మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. నిర్భయ దోషుల చివరి పిటిషన్‌ను శుక్రవారం తెల్లవారు జామున 3:30 గంటలకు సుప్రీం కోర్టు కొట్టివేసింది.
(చదవండి: నిర్భయ కేసు : దేశ చరిత్రలో ఇదే ప్రథమం​)

కాగా,  దోషులు పిటిషన్లమీద పిటిషన్లు వేయడంతో డెత్‌ వారెంట్లు జారీ అయ్యాక మూడు సార్లు ఉరి అమలు నిలిచిపోయింది. 2020, జనవరి 22 న దోషులను ఉరితీయాలని ఢిల్లీ పటియాలా హౌజ్‌కోర్టు తొలుత డెత్‌ వారెంట్లు జారీ చేసింది. దోషుల వరుస పిటిషన్లతో ఉరి అమలు సాధ్యం కాలేదు. అనంతరం ఫిబ్రవరి 1, తర్వాత మార్చి 3న ఉరితీయాలని డెత్‌ వారెంట్లు జారి అయినప్పటికీ శిక్ష అమలు వాయిదా పడింది. ఎట్టకేలకు మార్చి 20న (నాలుగోసారి) ఉరితీయాలని  జారీ అయిన డెత్‌ వారెంట్ల ద్వారా నిర్భయకు న్యాయం జరిగింది.
(చదవండి: నా కుమార్తెకు న్యాయం జరిగింది: ఆశాదేవీ)

ఏడేళ్ల నిర్భయ కేసు పరిణామాలు..

  • 2012, డిసెంబర్‌ 16న అర్థరాత్రి నిర్భయపై సామూహిక అత్యాచారం
  • కదులుతున్న బస్సులో అత్యాచారం చేసిన ఆరుగురు దోషులు
  • నిర్భయను అత్యంత క్రూరంగా హింసించి అత్యాచారం చేసిన దోషులు
  • నిర్భయతో ఉన్న స్నేహితుడిపైనా దాడిచేసిన ఆరుగురు దోషులు
  • తీవ్రగాయాలైనా ఇద్దరిని ఆస్పత్రికి తరలించిన పోలీసులు
  • చికిత్సపొందుతూ 2012, డిసెంబర్‌ 29న నిర్భయ మృతి
  • 2013, జనవరి 2న ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు
  • 2013, జనవరి 3న ఛార్జ్‌షీట్ దాఖలు
  • 2013, మార్చి 11న తీహార్ జైల్లో రామ్‌సింగ్ ఆత్మహత్య
  • 2013, మార్చి 21న నిర్భయ చట్టాన్ని అమల్లోకి తెచ్చిన కేంద్రం
  • 2013, ఆగస్టు 31న మైనర్ దోషికి మూడేళ్ల రిఫార్మ్ హోం శిక్ష
  • 2013, సెప్టెంబర్‌ 13న నలుగురికి ఉరిశిక్ష విధిస్తూ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు తీర్పు
  • 2014, మార్చి 13న ఉరిశిక్షను సమర్థిస్తూ ఢిల్లీ హైకోర్టు తీర్పు
  • 2015, డిసెంబర్ 20న రిఫార్మ్ హోం నుంచి మైనర్ విడుదల
  • 2017, మే 5న ఉరిశిక్షను సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పు
  • 2020, జనవరి 7న ఉరిశిక్ష అమలుకు ఢిల్లీ హైకోర్టు ఆదేశం
  • 2020, ఫిబ్రవరి 1న ఉరితీయాలని ఢిల్లీ కోర్టు డెత్ వారెంట్లు
  • ఉరిశిక్షను నిలిపేయాలంటూ కోర్టులో దోషుల పిటిషన్లు
  • ఎట్టకేలకు 2020, మార్చి 20న నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలు
మరిన్ని వార్తలు