'నిర్భయ దోషులకు 7రోజుల గడువు'

5 Feb, 2020 19:23 IST|Sakshi

న్యూఢిల్లీ: నిర్భయ దోషుల ఉరి శిక్ష వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూనే ఉంది. నిర్భయ దోషుల ఉరిపై ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. నిర్భయ దోషులను వేరువేరుగా ఉరితీయొద్దన్న హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దోషులను వెంటనే ఉరితీసేలా ఆదేశాలివ్వాలని కేంద్ర హోంశాఖ సుప్రీంకోర్టును కోరింది. కాగా.. దోషుల ఉరిశిక్షపై స్టేను ఎత్తివేసి శిక్షించాలని కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేయడంతో పాటు.. డెత్‌ వారెంట్లపై స్టే విధించిన పాటియాలా హౌస్‌ కోర్టు తీర్పును పక్కన పెట్టేందుకు నిరాకరించింది.

నిర్భయ కేసు: క్లైమాక్స్‌కు చేరిన ఉరిశిక్ష వ్యవహారం!

శిక్ష అమలు జాప్యానికి చేసే ప్రయత్నాన్ని హైకోర్టు పరిగణనలోకి తీసుకుని.. వారం రోజుల్లోగా దోషులు తమ న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకోవాలని ఆదేశించింది. అయితే.. దోషులకు విడివిడిగా ఉరిశిక్ష అమలు చేయడం మాత్రం సాధ్యంకాదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. జైలు నిబంధనలు 834, 836 అంశాలను కోడ్ చేస్తూ ఆర్టికల్ 21ను ఉపయోగించి వీరు ఉరిశిక్ష అమలును జాప్యం చేస్తున్నారన్న విషయాన్ని కూడా హైకోర్టు వ్యక్త పరిచింది. అయితే న్యాయపరంగా వీరికి ఉన్న అవకాశాలను వారం రోజుల్లోగా వినియోగించుకోవాలని హైకోర్టు ఆదేశించింది.  (ఇంకా సమయం ఇవ్వొద్దు!)

ఈ రోజు నుంచి వారం రోజుల్లోగా.. దోషులకు ఉన్న న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే వినయ్, ముఖేష్‌కు సంబంధించిన న్యాయపరమైన అవకాశాలన్నీ ముగిసిపోయాయి. అక్షయ్‌కు సంబంధించిన క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉంది. పవన్ కు సంబంధించి క్యురేటివ్ పిటిషన్, అలాగే మెర్సీ పిటిషన్ ఫైల్ చేయాల్సివుంది. ఈ ఇద్దరు కూడా వారం రోజుల్లోగా వారికున్న న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకోవాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించడంతో వీరు వారం రోజుల్లోపు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. 

మరిన్ని వార్తలు