'నిర్భయకేసు దోషులకు త్వరలో మరణశిక్ష'

3 Dec, 2019 14:18 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపి, మహిళల రక్షణకు కొత్త చట్టాలు చేసేలా పాలకులను కదిలించిన నిర్భయ కేసులో దోషులకు వచ్చే నెలలో ఉరి శిక్ష అమలు కానుంది. ఇప్పటి వరకూ వారు పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్లు ఏవీ ఆమోదానికి నోచుకోలేదు. నిర్భయ కేసులో మరణశిక్ష పడి, ప్రస్తుతం తీహార్‌ జైలులో ఉన్న వినయ్‌శర్మ రాష్ట్రపతి క్షమాభిక్ష కోసం పిటిషన్‌ దాఖలు చేశారు. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ దోషి క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించిన వెంటనే కోర్టు దోషులను ఉరి తీయాలని బ్లాక్ వారెంట్ జారీ చేసే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని తీహార్ జైలులో ఉరి తీసే తలారీ లేకపోవడంపై జైలు అధికారులు తలలుపట్టుకుంటున్నారు. ఉరి తీసే తలారీ ఉద్యోగాన్ని భర్తీ చేయడం కానీ.. తాత్కాలికంగా ఎక్కడైనా పని చేస్తున్న వారిని తీహార్‌ జైలుకు బదిలీ చేసి.. శిక్షను అమలు పరచలా అని అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. నిర్భయ కేసులో శర్మ, ముకేశ్, పవన్, అక్షయ్, రామ్ సింగ్, ఓ మైనర్ బాలుడు నిందితులు కాగా, మైనర్ బాలుడు విడుదలయ్యాడు. రామ్ సింగ్ జైల్లోనే ఉరేసుకుని చనిపోయిన సంగతి తెలిసిందే. మిగిలిన నలుగురినీ ఉరితీయాల్సి ఉంది. 

ఇటీవల శర్మ మెర్సీ పిటిషన్ పెట్టుకోగా, దాన్ని తిరస్కరించాలని ఢిల్లీ సర్కారు సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కు జాతీయ మహిళా కమిషన్ లేఖ రాసింది. నిర్భయ ఘటనలో దోషులకు క్షమాభిక్ష పెట్టవద్దని లేఖ లో విజ్ఞప్తి చేశారు. రాష్ట్రపతి క్షమాభిక్షను తిరస్కరిస్తే నిర్భయ కేసులో దోషులైన వినయ్ శర్మతోపాటు ముకేష్, పవన్, అక్షయ్ లకు మరణశిక్షను అమలు చేయనున్నారు. ఢిల్లీలో 2012 డిసెంబరు 16వ తేదీన కదులుతున్న బస్సులో ఒక పారా మెడికల్ విద్యార్థినిపై ఆరుగురు వ్యక్తులు పాశవికంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను బస్సు నుంచి రోడ్డు పక్కన పడేశారు. తరువాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె అదే సంవత్సరం డిసెంబర్ 20న కన్నుమూసింది. ఈ కేసులో బాధితురాలి వివరాలను గోప్యంగా ఉంచడం కోసం ఆమె పేరును నిర్భయగా నిర్ణయించారు. అంతే కాకుండా ఆ పేరుపై మహిళల సంరక్షణ కోసం ఒక ప్రత్యేక చట్టాన్ని ప్రభుత్వం తెచ్చింది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా