వారి చావును చూడాలనుంది : ఆశాదేవి

5 Mar, 2020 15:28 IST|Sakshi

డెత్‌వారెంట్ల జారీపై నిర్భయ తల్లి హర్షం

సాక్షి, న్యూఢిల్లీ : నిర్భయ అత్యాచార దోషులకు పటియాల హౌస్‌కోర్టు తాజాగా డెత్‌వారెంట్లు జారీచేయడంపై ఆమె తల్లి ఆశాదేవి హర్షం వ్యక్తం చేశారు. దోషుల ఉరితీతపై గురువారం విచారణ సందర్భంగా కోర్టు వద్దకు చేరుకున్న ఆమె.. తీర్పు అనంతరం ఆమె తరఫున వాదించిన న్యాయవాదిని కౌగిలించుకుని కన్నీటిపర్యంతమయ్యారు. డెత్‌వారెంట్లు జారీ అనంతరం ఆశాదేవి మీడియా మాట్లాడారు. ‘నా కూతురిపై అత్యాచారం జరిపిన నలుగురు దోషులను ఉరితీసే సమయం ఆసన్నమైంది. నలుగురు కామాంధులను ఉరితీసిన రోజే నా కూతురికి న్యాయం జరిగినట్టు. అదే మాకు పెద్ద విజయం. ఇప్పటికే మూడుసార్లు ఉరి వాయిదా పడటం విచారం. ఇక వారికున్న న్యాయపరమైన అంశాలన్నీ మూసుకుపోయాయి. దోషులు చట్టం నుంచి ఇక తప్పించుకోలేరు. అవకాశం ఉంటే.. వారి చావును నాకు చూడాలని ఉంది’ అని అన్నారు. (నిర్భయ దోషులకు డెత్‌ వారెంట్లు జారీ)

నిజానికి  ఫిబ్రవరి 17న జారీ చేసిన డెత్‌ వారెంట్‌ ప్రకారం.. నిర్భయ దోషులు నలుగురినీ మార్చి 3 ఉదయం 6 గంటలకు ఉరితీయాల్సి ఉంది. నలుగురు దోషుల్లో ఒకరైన పవన్‌ గుప్తా రాష్ట్రపతి ముందు పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ పరిశీలనలో ఉండడంతో తదుపరి ఆదేశాలిచ్చే వరకు ఉరిశిక్షను నిలిపివేయాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో ఉరితీత మూడోసారి వాయిదాపడింది. తాజాగా ట్రయల్‌కోర్టు కొత్త డెత్‌వారెంట్లు జారీచేస్తూ మార్చి 20న ఉరితీయాలని ఆదేశించింది. అయితే దోషులకు ఉన్న న్యాయపరమైన అంశాలన్నీ మూసుకుపోవడంతో ఈసారి శిక్ష అమలు జరిగి తీరుతుందని న్యాయవాదులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.

మరిన్ని వార్తలు