ఉరి ఖాయం.. ఆరోజే నా కూతురికి న్యాయం

14 Jan, 2020 11:26 IST|Sakshi

నిర్భయ తల్లి వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: నిర్భయ కేసు దోషులు దాఖలు చేసిన క్యూరేటివ్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేస్తుందని బాధితురాలి తల్లి ఆశాభావం వ్యక్తం చేశారు. ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు దోషులు చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావని పేర్కొన్నారు. ఏడేళ్ల క్రితం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ ఉదంతంలో దోషులైన ముఖేష్‌ సింగ్‌ (32), పవన్‌ గుప్తా (25), వినయ్‌ శర్మ (26), అక్షయ్‌ కుమార్‌ ఠాకూర్‌ (31)లను ఈ నెల 22 ఉదయం 7 గంటలకు తీహార్‌ జైల్లో ఉరి తీయాలని ఢిల్లీలోని పటియాలా హౌజ్‌ కోర్టు డెత్‌ వారెంట్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వినయ్‌ శర్మ, ముఖేష్‌ కుమార్లు సుప్రీంకోర్టులో క్యూరేటివ్‌ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ క్రమంలో మంగళవారం జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం(అరుణ్‌ మిశ్రా, ఆర్‌ఎఫ్‌ నారీమణ్‌, ఆర్‌ భానుమతి, అశోక్‌ భూషణ్‌) విచారించనుంది.(నేనొక బండరాయిని.. నాకు భావోద్వేగాలు లేవు)

ఈ నేపథ్యంలో నిర్భయ తల్లి మాట్లాడుతూ... ‘ఆ దోషులు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. కానీ నేడు అవి తిరస్కరించబడతాయని నేను భావిస్తున్నాను. జనవరి 22న వారిని ఉరి తీయడం ఖాయం. ఆరోజే నిర్భయకు న్యాయం జరుగుతుంది’ అని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు చేసేందుకు డెత్‌ వారెంట్‌ జారీ అయిన నేపథ్యంలో తీహార్‌ జైలు అధికారులు ఇందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగా ఇసుక బస్తాలతో డమ్మీ ఉరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దోషులు పవన్‌గుప్తా, అక్షయ్‌, వినయ్‌ శర్మ, ముకేశ్‌ సింగ్‌ల బరువు ఆధారంగా ఇసుక సంచులను సిద్ధం చేసినట్లు..వాటిని ఉరి తాళ్లకు కట్టి 1.8 మీటర్ల నుంచి 2.4 మీటర్ల ఎత్తులో వేలాడదీయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. (దోషులు న్యాయపరమైన మార్గాలను ఉపయోగించుకోలేదు..)

నిర్భయ: ఇసుక బస్తాలతో డమ్మీ ఉరికి సన్నాహాలు

మరిన్ని వార్తలు