వాళ్లను త్వరలోనే ఉరి తీస్తారు: నిర్భయ తల్లి

6 Feb, 2020 08:27 IST|Sakshi
నిర్భయ తల్లి(ఫైల్‌ ఫొటో)

న్యూఢిల్లీ: నిర్భయ దోషులకు వారం రోజుల గడువు ఇస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు బాధితురాలి తల్లి ఆశాదేవి తెలిపారు. న్యాయస్థానం విధించిన గడువుతో దోషులను ఉరితీస్తారనే నమ్మకం కలిగిందన్నారు. నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో దోషులకు విధించిన మరణ శిక్ష అమలులో ఆలస్యాన్ని సవాల్‌ చేస్తూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు బుధవారం కొట్టివేసిన విషయం తెలిసిందే. శిక్ష అమలు జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం.. అదే సమయంలో దోషులందరికీ న్యాయపరమైన అన్ని అవకాశాలు వినియోగించుకునేందుకు వారం రోజుల గడువు విధించింది. అదే విధంగా ఈ కేసులోని దోషులందరినీ ఒకేసారి ఉరితీయాలని పేర్కొంది.

ఈ నేపథ్యంలో నిర్భయ తల్లి ఆశాదేవి మాట్లాడుతూ... ‘‘ఢిల్లీ హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నా. చట్టపరమైన అవకాశాలను ఉపయోగించుకునేందుకు ఆ నలుగురు దోషులకు వారం సమయం ఇచ్చింది. ఇక వాళ్లను త్వరలోనే ఉరితీస్తారు’’ అని హర్షం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా... నిర్భయ దోషుల్లో ఒకడైన అక్షయ్‌కుమార్‌ సింగ్‌ పెట్టుకున్న క్షమాభిక్షను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తిరస్కరించినట్లు హోంశాఖ అధికారులు బుధవారం తెలిపారు. ఇక ఈ కేసులో దోషులైన అక్షయ్‌ కుమార్‌ సింగ్‌, వినయ్‌ శర్మ క్షమాభిక్ష పిటిషన్లను రాష్ట్రపతి ఇప్పటికే తిరస్కరించిన విషయం తెలిసిందే. (నిర్భయ కేసు: నలుగురినీ ఒకేసారి ఉరి తీయాలి..)

నిర్భయ దోషులకు త్వరలోనే ఉరి: కేంద్ర మంత్రి
నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలుపై జాప్యం గురించి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ... ఉరిశిక్ష అమలు జరిగితీరుతుందని  కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ లోక్‌సభలో తెలిపారు. దోషులు ఉరిశిక్ష అమలును వాయిదా వేయాలని చూస్తున్నారని ఆరోపించారు. నిర్భయ కేసులో ఇప్పటికే దోషులకు ఉరిశిక్ష విధించిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ విషయంలో కేంద్రం చాలా కఠినంగా ఉందనీ, త్వరలోనే దోషులకు ఉరిశిక్ష అమలు చేస్తారనీ సభకు తెలిపారు. నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలుపై స్టేకి వ్యతిరేకంగా కేంద్రం దాఖలు చేసుకున్న పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడంతో కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. నిర్భయ దోషులకు శిక్ష అమలు విషయంలో ఇక ఎంతో కాలం వేచి ఉండలేమనీ, క్షమాభిక్ష అర్జీలతో సహా న్యాయపరమైన అన్ని అవకాశాలనూ వినియోగించుకున్నందున దోషులను విడివిడిగా ఉరితీయాలంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు.

దోషుల లాయర్‌ నన్ను సవాలు చేశాడు: నిర్భయ తల్లి

తనను రక్తపు మడుగులో చూశా.. బండరాయిని

ఏడేళ్లు.. కానీ ఆ బస్టాప్‌ వద్ద ఇంకా...

మరిన్ని వార్తలు