మాటల కోటల్లో.. రక్షణకు అరకొరే..

2 Feb, 2020 04:56 IST|Sakshi

డిఫెన్స్‌కు 3.37 లక్షల కోట్లు కేటాయింపు

గతం కంటే 5.8 శాతమే పెరుగుదల

న్యూఢిల్లీ: బడ్జెట్‌ ప్రసంగం ప్రారంభంలో దేశ భద్రతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని చెప్పిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రక్షణ రంగానికి రూ. 3.37 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. పొరుగు దేశాల హెచ్చరికల నేపథ్యంలో దేశ రక్షణ రంగం అధిక ఆర్థిక కేటాయింపుల కోసం ఎదురుచూస్తుండగా గత యేడాదికంటే రక్షణ బడ్జెట్‌ కేటాయింపులను కేంద్రం ఆరుశాతం కూడా పెంచకపోవడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరం రక్షణ రంగానికి రూ.3.18 లక్షలకోట్లు కేటాయించింది.

కొత్త ఆయుధాల కొనుగోలు, యుద్ధ విమానాలూ, యుద్ధనౌకలు, ఇతర సైనిక పరికరాలు కొనుగోలు చేయడానికి మూలధన వ్యయం కోసం రూ. 1.13 లక్షల కోట్లు కేటాయించారు. 2019–20 సవరించిన రూ. 3.31 లక్షల కోట్ల అంచనా ప్రకారం అయితే ఈ పెంపుదల కేవలం 1.8 శాతం మాత్రమే. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది చైనా–భారత్‌ యుద్ధం1962 తరువాత రక్షణ రంగానికి జరిపిన అతితక్కువ బడ్జెట్‌ కేటాయింపులు. ఉద్యోగుల వేతనాలూ, నిర్వహణకు రూ.2.09 లక్షల కోట్లు అవుతుంది. రక్షణ రంగ ఉద్యోగులకు పెన్షన్లకు కేటాయించిన రూ.1.33 కోట్లు కలుపుకుంటే ఈ మొత్తం కేటాయింపులు 4.71 లక్షల కోట్ల రూపాయలకు చేరతాయి.

చైనా తన రక్షణ వ్యవస్థని మరింత పటిష్టం చేసుకుంటున్న నేపథ్యంలోనూ, మారుతున్న దేశభద్రత రీత్యా, సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో రక్షణ రంగ ఆధునికీకరణకు ఇంకా ఎక్కువ నిధులు అవసరమవుతాయి. గత ఏడాది బాలకోట్‌ దాడుల అనంతరం బడ్జెట్‌ కేటాయింపులు పెరుగుతాయన్న ఆశాభావం వ్యక్తం అయ్యింది. అయితే ఊహించిన దానికంటే భిన్నంగా తక్కువ నిధులే  కేటాయించారు.అవసరాలను అనుగుణంగా కేటాయింపులు లేకపోయినప్పటికీ దేశ ఆర్థిక పరిస్థితిని పరిగణనలోనికి తీసుకుంటే ఈ కేటాయింపులు సంతృప్తికరంగానే ఉన్నాయన్న వాదన కూడా వినిపిస్తోంది.
 
‘‘రక్షణ రంగానికి కేటాయించిన ని«ధులు సరిపోక పోయినప్పటికీ, దేశ ఆర్థిక వ్యవస్థని పరిగణనలోనికి తీసుకోవాల్సి ఉంటుంది. అని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టడీస్‌ అండ్‌ ఎనాలసిస్‌ కి చెందిన డాక్టర్‌ లక్ష్మణ్‌ వ్యాఖ్యానించారు. గత ఏడాది పెట్టుబడి వ్యయం రూ.1,03,394 కోట్లను రూ.1,13,734 కోట్లకు పెంచారు. ఇది గతం కంటే 10,340 కోట్ల రూపాయలు అధికం. ఇక ఉద్యోగుల వేతనాలూ, నిర్వహణ విభాగాలను కలిపితే రూ.2,09,319 కోట్ల రూపాయలవుతుంది. అయితే గత ఆర్థిక సంవత్సరం 2019–20లో వేతనాలూ, తదితరాలకు 2,01,901 కోట్ల రూపాయలు కేటాయించారు.  

 గత పదేళ్లలో రక్షణ రంగ కేటాయింపులు  పెరుగుతూ వస్తున్నాయి.   ప్రతియేటా సుమారు రక్షణ రంగం నుంచి దాదాపు 60,000 మంది పదవీ విరమణ చేస్తున్నందున ఈ రంగంలో పెన్షన్లకు కేటాయించే నిధుల శాతం పెరుగుతున్నట్టు 2019లో స్టాండింగ్‌ కమిటీ పేర్కొన్నది. దీంతో సాయుధ దళాల ఆధునీకరణకు  నిధులు తగ్గుతున్నాయి. గత పదేళ్ళలో రక్షణరంగంలోని ఉద్యోగుల పెన్షన్లకు ఖర్చు చేస్తున్న మొత్తం 12 శాతానికి పెరిగింది.  ప్రభుత్వం పెన్షన్‌ బిల్లును, కొన్ని ఇతర పెన్షన్‌ పథకాలను ప్రవేశపెట్టడం ద్వారా లేదా ముందస్తు పదవీ విరమణ ద్వారా ప్రభుత్వం పెన్షన్‌ బిల్లుని తగ్గిస్తుందని స్టాండింగ్‌ కమిటీ పేర్కొంది.  

>
మరిన్ని వార్తలు