20 కోట్ల మంది మహిళలకు నగదు బదిలీ

17 May, 2020 12:32 IST|Sakshi

న్యూఢిల్లీ : రాష్ట్రాలకు రుణ పరిమితి 3 నుంచి 5 శాతానికి పెంచుతున్నట్టు కేంద్ర ఆర్థికి మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. రుణ పరిమితిని 3 నుంచి 3.5 శాతం పెంచుకునేందుకు ఎలాంటి షరతులు వర్తించబోవని స్పష్టం చేశారు. అయితే కొన్ని షరతులతో 3.5 నుంచి 5 శాతం వరకు రుణ పరిమితిని పెంచుకునే అవకాశం కల్పించారు. రుణ పరిమితి పెంపు వల్ల రాష్ట్రాలకు రూ. 4.28 లక్షల కోట్లు అదనంగా అప్పులు తెచ్చుకునే అవకాశం లభిస్తుందన్నారు. కరోనా ప్రభావం నుంచి ఆర్థిక రంగాన్ని గట్టెక్కించడానికి ప్రధాని నరేంద్ర మోదీ స్వయం సమృద్ధి భారతం పేరిట రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి ఆఖరి విడత ప్యాకేజీ వివరాలను ఆదివారం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు.

 కోవిడ్‌ దృష్ట్యా రాష్ట్రాలు ఆదాయాన్ని కోల్పోతున్నాయని అన్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వాలను ఆదుకునేందకు అన్నివిధాలా చర్యలు తీసకుంటున్నామని చెప్పారు. రూ. 11,092 కోట్ల ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిధులను ఇప్పటికే అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. జీతభత్యాల చెల్లింపులో రాష్ట్రాలకు ఓవర్‌డ్రాఫ్ట్‌ తీసకునే అవకాశం కల్పించడంతో పాటుగా.. ఓవర్‌డ్రాఫ్ట్‌  తీసుకునే అవకాశాన్ని 52 రోజులకు పెంచినట్టు వెల్లడించారు. పన్ను ఆదాయం కింద రాష్ట్రాలకు రూ. 46 వేల కోట్ల కేటాయింపులు చేస్తున్నట్టు తెలిపారు. 

ఇప్పటికే చాలా రంగాల్లో సంస్కరణలకు సంబంధించి ప్రకటనలు చేశామని నిర్మల గుర్తుచేశారు. ప్రాణం ఉంటేనే.. ప్రపంచం ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన మాటలను గుర్తుచేశారు. పేదలకు ఇబ్బంది కలగకుండా మూడు నెలలకు సరిపడా రేషన్‌ సరఫరా చేశామని చెప్పారు. పీఎం కిసాన్‌ పథకం ద్వారా 8.19 కోట్ల మందికి రూ. 2వేల చొప్పున ఇచ్చామని వెల్లడించారు. జన్‌ధన్‌ ఖాతాల ద్వారా 20 కోట్ల మంది మహిళలకు నగదు బదిలీ చేశామన్నారు. నిర్మాణ రంగంలో పనిచేసే 2.20 కోట్ల మంది కూలీలకు ఆర్థిక సహాయం అందించామని.. భవన నిర్మాణ కార్మికుల ఖాతాల్లో రూ. 3,995 కోట్లు జమచేశామని చెప్పారు. 

ఉజ్వల యోజన ద్వారా 6.81 కోట్ల ఫ్రీ సిలిండర్లు సరఫరా చేశామని మంత్రి తెలిపారు. 12 లక్షల మంది ఈపీఎఫ్‌ ఖతాదారులు ఒకేసారి నగదు విత్‌ డ్రా చేసుకున్నారని వెల్లడించారు. దేశంలో వైద్య సదుపాయాల ఏర్పాటుకు రూ. 15 వేల కోట్లు కేటాయించినట్టు చెప్పారు. ఇప్పటికే 51 లక్షల పీపీఈ కిట్లు, 87 లక్షల ఎన్‌-95 మాస్క్‌లు సరఫరా చేశామన్నారు. వైద్య రంగంలో పనిచేసే సిబ్బంది రూ. 50 లక్షల బీమా సౌకర్యం అందిస్తున్నట్టు తెలిపారు. కోవిడ్‌ రిలీఫ్‌ ఫండ్‌ కింద రాష్ట్రాలకు రూ. 4,113 కోట్లు అందజేశామని తెలిపారు. 

ఆర్థిక మంత్రి ప్రసంగంలోని ముఖ్యాంశాలు..

  • గ్రామీణ ప్రాంతాల్లో ప్రజారోగ్యం కోసం ల్యాబ్‌ల ఏర్పాటు
  • జిల్లా స్థాయిలో ప్రతి ఆస్పత్రిలో డిస్‌ఇన్పెక్షన్‌ సెంటర్ల ఏర్పాటు
  • ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌ను ప్రోత్సహించడంలో భాగంగా వన్‌ క్లాస్‌, వన్‌ డిజిటిల్‌ పేరుతో డిజిటల్‌ పాఠాలు. 
  • త్వరలోనే టీవీ, రేడియోల ద్వారా ఆన్‌లైన్‌ పాఠాలు
  • దేశవ్యాప్తంగా వైద్య సదుపాయాల ఏర్పాటుకు రూ. 15 వేల కోట్లు కేటాయించాం. 
  • గ్రామీణ ఉపాధి హామీ పనులకు అదనంగా మరో రూ. 40 వేల కోట్లు

మరిన్ని వార్తలు