మేకిన్‌ ఇండియా దిశగా మోదీ 2.0 బడ్జెట్‌

6 Jul, 2019 03:24 IST|Sakshi

లోక్‌సభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే–2 ప్రభుత్వం తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టింది. 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పద్దును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శుక్రవారం సభలో సుదీర్ఘంగా చదివి వినిపించారు. పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మహిళగా రికార్డు సృష్టించిన నిర్మల.. సందర్భోచితంగా చిన్న చిన్న సూక్తులు వినిపిస్తూ.. సభికులను ఆకట్టుకున్నారు. బడ్జెట్‌లో తమ ప్రభుత్వ కేటాయింపులను, ప్రాధాన్యాలను స్పష్టంగా ప్రకటించారు. ప్రసంగానికి ముందు ఆర్థిక మంత్రికి స్పీకర్‌ ఓం బిర్లా, ప్రధాని మోదీ, ఇతర సహచర మంత్రులు అభినందనలు తెలిపారు. సుమారు 2 గంటల 15 నిమిషాలకుపైగా ఆమె బడ్జెట్‌ ప్రసంగం చేశారు. ఇంగ్లిష్‌లో ఆమె ప్రసంగించినా.. మధ్య, మధ్యలో హిందీ, తమిళం, ఉర్దు, సంస్కృత పదాలను సమయానుకూలంగా వాడారు.

ఆమె కీలకమైన ప్రకటనలు చేసినప్పుడల్లా సహచర సభ్యులు బల్లలు చరుస్తూ సంతోషం వెలిబుచ్చారు. మొత్తం రూ. 27,86,349 కోట్ల బడ్జెట్‌ను ప్రతిపాదించారు. ఆమె ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో మేకిన్‌ ఇండియా దిశగా పలు రాయితీలు ప్రకటించారు. విద్యుత్‌ వాహనాల వినియోగాన్ని పెంచడానికి ప్రోత్సాహకాలు ఇచ్చారు. స్టార్టప్‌లను మరిన్ని నెలకొల్పే దిశగా చర్యలు తీసుకున్నారు. అలాగే కార్పొరేట్లకు పన్నుల్లో ఊరట కలిగించారు. కానీ సుంకం పెంపుతో పెట్రోల్, డీజిల్‌ రేట్లు ఒక్కసారిగా పెరిగాయి. డజన్ల కొద్దీ వస్తువులపైన దిగుమతి సుంకాన్ని విధించారు. అయితే స్టార్టప్‌లకు, గృహనిర్మాణం, కార్పొరేట్లకు రాయితీలు ఇవ్వడం ద్వారా దేశాభివృద్ధిని పరుగులు పెట్టించాలని భావిస్తున్నారు. విమానయానం, బీమా, మీడియాలో విదేశీ పెట్టుబడులు ఆహ్వానిస్తామని ప్రకటించారు. 

ధనవంతులకు సర్‌ చార్జ్‌.. 
ఈ ఏడాది బడ్జెట్‌లో ఆదాయ పన్ను స్లాబ్‌ల్లో ఏ విధమైన మార్పులు చేయలేదు. కానీ ధనవంతుల ఆదాయానికి మాత్రం సర్‌చార్జ్‌ పెంచారు. రూ. 2 కోట్ల నుంచి రూ. 5 కోట్ల వరకూ పన్ను పరిధిలోని ఆదాయానికి 39 శాతం, రూ. 5 కోట్లు పైబడిన ఆదాయం సంపాదించే వారికి 42.47 శాతం సర్‌చార్జ్‌ విధించారు. దీనిపై ఆర్థిక మంత్రి మాట్లాడుతూ.. దేశాభివృద్ధికి అత్యంత ధనవంతులు మరింత తోడ్పాటు అందించాలని చెప్పారు. ఇక రూ. కోటి పైబడిన నగదు ఉపసంహరణపై 2 శాతం టీడీఎస్‌ చెల్లించాల్సి ఉంటుంది.

బంగారంపై కస్టమ్స్‌ సుంకం పెంపు..  
పన్ను ఆదాయంలో పెరుగుదలకు, లోటును తగ్గించడానికి ప్రభుత్వరంగ సంస్థల్లోనివాటాలను విక్రయించడానికి ఆర్థిక మంత్రి ప్రణాళికలు ప్రకటించారు. అలాగే ఆర్బీఐ, ప్రభుత్వ రంగ బ్యాంకులు, కంపెనీల నుంచి మరింత డివిడెండ్‌ వచ్చేలా చూడాలన్నారు. ఇక పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్‌ డ్యూటీ రూ.1, సెస్‌ రూ.1 విధించారు. బంగారం నుంచి ఆటోమొబైల్‌ పరికరాలు, పొగాకు ఉత్పత్తుల వరకూ డజన్ల కొద్దీ వస్తువులపై దిగుమతి సుంకాలను విధించారు. పసిడిపై కస్టమ్స్‌ సుంకాన్ని 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచారు.
 
కార్పొరేట్‌లకు ఊరట.. 
కార్పొరేట్‌ కంపెనీలకూ ఆర్థిక మంత్రి ఊరట నిచ్చా రు. రూ. 400 కోట్ల వరకూ ఆదాయం ఉన్న కంపెనీలకు కార్పొరేట్‌ ట్యాక్స్‌ను 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గించారు. ప్రస్తుతం రూ. 250 కోట్లు ఆదాయం ఉన్న కంపెనీలకు ఈ ట్యాక్స్‌ విధిస్తుండగా.. దాని పరిమితిని రూ. 400 కోట్లకు పెంచారు. దాదాపు 99.3 శాతం కంపెనీలకు ఈ తగ్గింపు వర్తిస్తుందని ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో పేర్కొన్నారు. 

విద్యుత్‌ వాహనాలకు ప్రోత్సాహకాలు
మేకిన్‌ ఇండియాకు ప్రోత్సాహం దిశగా కొన్ని పెట్టుబడులు, ముడిసరుకులపై రాయితీలు ఇచ్చారు. అదేవిధంగా కొన్ని వస్తువులపై సుంకాలను పెంచారు. విద్యుత్‌పై నడిచే వాహనాలను ప్రోత్సహించేందుకు ఆ వాహనాల తయారీకి కావాల్సిన పరికరాలపై కస్ట మ్స్‌ సుంకాన్ని తగ్గించారు. అలాగే ఎలక్ట్రిక్‌ వాహనా ల్లో ఉపయోగించే కొన్ని విడిభాగాలపై కస్టమ్స్‌ సుం కాన్ని పూర్తిగా ఎత్తివేశారు. వీటిపై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. విద్యుత్‌ వాహనాలు కొనుగోలు చేయడానికి తీసుకున్న అప్పునకు సంబంధించిన వడ్డీపై అదనంగా రూ. 1.5 లక్షల ఆదాయపు పన్నును తగ్గిస్తూ ప్రతిపాదనలు చేశారు. ఈ ఏడాది భారత ఆర్థిక వ్యవస్థ 3 ట్రిలియన్ల అమెరికన్‌ డాలర్లకు చేరుకుంటుందని, ఇది ఆరో అతిపెద్ద వ్యవస్థ అని సీతారామన్‌ పేర్కొన్నారు. వచ్చే సంవత్సరాల్లో దీనిని 5 ట్రిలియన్ల అమెరికన్‌ డాలర్లుకు తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. 

తొలిసారి ఇల్లు కొంటే..
రైతులకు నగదు సహాయం పెంపుతో పాటు ఒక కొత్త పింఛన్‌ పథకం తీసుకొచ్చారు. చిన్న మొత్తంలో పన్నులు కట్టేవారికి ఉపశమనం కలిగించారు. ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ. 70 వేల కోట్ల మూలధన నిధిని ఈ బడ్జెట్‌లో ప్రతిపాదించారు. తొలిసారి రూ. 45 లక్షల లోపు ఇల్లు కొంటే వారికి రూ. 1.5 లక్షలను అదనంగా వడ్డీ చెల్లింపులో తగ్గించాలని ప్రతిపాదించారు. బడ్జెట్‌లో కొన్ని రక్షణ పరికరాలకు ప్రాథమిక కస్టమ్స్‌ సుంకాన్ని మినహాయించారు. ఇక నిధుల సేకరణ కోసం తొలి గ్లోబల్‌బాండ్‌ను ప్రభుత్వం విక్రయించనుంది.  వచ్చే ఐదేళ్లలో మౌలిక సదుపాయాలపై రూ. 100 కోట్లు వెచ్చించనున్నామని ఆమె చెప్పారు.

ఇది గ్రీన్‌ బడ్జెట్‌: ప్రధాని మోదీ
కేంద్ర ఆర్థిక మంత్రి ప్రజానుకూల బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టారని ప్రధాని మోదీ ప్రశంసించారు. ఈ బడ్జెట్‌  భవిష్యత్‌పై ఆశలు కల్పించేదిగా ఉందన్నా రు. శుక్రవారం మీడియాతో ప్రధాని మాట్లాడుతూ..‘ఈ బడ్జెట్‌తో దేశంలోని పేదలకు సాధికారత చేకూరుతుంది. పర్యావరణ పరిరక్షణ కోసం పునరుత్పాదక ఇంధనాల ఉత్పత్తిని పెంపొందించేందుకు బడ్జెట్‌ దృష్టి సారించింది. ఇది గ్రీన్‌ బడ్జెట్‌. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు నిర్మాణాత్మక సంస్కరణపై రోడ్‌మ్యాప్‌ రూపొందించాం’ అన్నారు. 

ఎన్నడూ ఇలా జరగలేదు: చిదంబరం
ఇది పసలేని బడ్జెట్‌. ఆర్థిక మంత్రి నిర్మల ప్రసంగం అస్పష్టంగా సాగడం విడ్డూరం. ఇలా గతంలో ఎన్నడూ జరగలేదు. దేశంలోని ఏ వర్గం వారికి కూడా బడ్జెట్‌ ద్వారా ఊరట కల్పించలేకపోయారు. వివిధ మంత్రిత్వ శాఖలకు, ముఖ్యమైన పథకాలకు కేటాయింపులు లేవు. ఆదాయ వ్యయ వివరాలు, ద్రవ్యలోటు, రెవెన్యూ లోటు వంటి వాటిని వెల్లడించలేదు. 
 

మరిన్ని వార్తలు