ఆర్మీలోకి అధునాతన శతఘ్ని వ్యవస్థలు

10 Nov, 2018 04:03 IST|Sakshi
కొత్త కే9 వజ్ర యుద్ధట్యాంకు

అందజేసిన రక్షణమంత్రి సీతారామన్‌  

దియోలాలి: భారత ఆర్మీ సామర్థ్యాన్ని పెంపొందించడంలో భాగంగా మూడు శతఘ్ని వ్యవస్థలను కొనుగోలు చేసినట్లు రక్షణమంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. వీటిలో ఎం777 ఏ2 అల్ట్రాలైట్‌ హోవిట్జర్లు, కె9 వజ్ర శతఘ్నులతో పాటు ఆయుధాలను సరిహద్దులకు చేరవేసే ఫీల్డ్‌ ఆర్టిలరీ ట్రాక్టర్‌(ఫ్యాట్‌)లు ఉన్నాయి. మహారాష్ట్రలోని దియోలాలి ఫీల్డ్‌ ఫైరింగ్‌ రేంజెస్‌లో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో సీతారామన్‌ వీటిని సైన్యానికి అందజేశారు. అమెరికా నుంచి కొనుగోలు చేసిన ఎం777 ఏ2(155 ఎంఎం–39 క్యాలిబర్‌)హోవిట్జర్‌ శతఘ్నులు 30 కి.మీ దూరంలోని శత్రు స్థావరాలను తుత్తునియలు చేయగలవు.

మారుమూల, పర్వత ప్రాంతాలకు హెలికాప్టర్ల ద్వారా తరలించగల ఈ హోవిట్జర్ల ద్వారా పగలు, రాత్రి తేడా లేకుండా నిమిషానికి 5 రౌండ్ల కాల్పులు జరపొచ్చు. అలాగే దక్షిణకొరియాకు చెందిన థండర్‌–9ను అభివృద్ధి చేసి కె9 వజ్ర(155 ఎంఎం–52 క్యాలిబర్‌) యుద్ధ ట్యాంకును రూపొందించారు. వేరియంట్స్‌ను బట్టి ఈ ట్యాంకులు 30 కి.మీ నుంచి 58 కి.మీ దూరంలోని లక్ష్యాలను అవలీలగా ఛేదిస్తాయి. దాదాపు 100 వజ్ర యుద్ధ ట్యాంకుల్లో పదింటిని సైన్యం ఇప్పటికే అందుకోగా, మిగిలినవాటిని భారత్‌లో తయారు చేయనున్నారు. అలాగే శతఘ్నులను యుద్ధ సమయంలో సరిహద్దుకు తరలించేందుకు అవసరమైన 6్ఠ6 ఫీల్డ్‌ ఆర్టిలరీ ట్రాక్టర్‌(ఫ్యాట్‌)లను అశోక్‌ లేలాండ్‌ సంస్థ నుంచి సైన్యం కొనుగోలు చేసింది. 10 టన్నుల బరువును ఈ ట్రక్కులు అవలీలగా మోసుకెళ్తాయి.
 

మరిన్ని వార్తలు