ఆంధ్రప్రదేశ్‌ చేజారిన ఐఎన్‌ఎస్‌ విరాట్‌

31 Dec, 2018 20:38 IST|Sakshi

న్యూఢిల్లీ: నౌకా దళం సేవల నుంచి ఉపసంహరించిన విమాన వాహక యుద్ధనౌక ఐఎన్‌ఎస్‌ విరాట్‌ ఆంధ్రప్రదేశ్‌ చేజారిపోయింది. ఐఎన్‌ఎస్‌ విరాట్‌ను తమ రాష్ట్రానికి అప్పగించాల్సిందిగా మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతిపాదనకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్టు కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర‍్మలా సీతారామన్‌ సోమవారం రాజ్యసభలో ప్రకటించారు. ఐఎన్‌ఎస్‌ విరాట్‌ను 850 కోట్ల రూపాయలు వెచ్చించి హోటల్‌ కమ్‌ మ్యూజియంగా మార్చడానికి మహారాష్ట్ర ప్రభుత్వం రక్షణ మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపింది వాస్తవమేనా? అది నిజమైతే  దానికి సంబంధించిన వివరాలు ఏమిటిని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యులు వి విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు నిర్మలా సీతారామన్‌ రాతపూర్వక సమాధానమిచ్చారు. 

ఐఎన్‌ఎస్‌ విరాట్‌ను విశాఖపట్నం వద్ద అంతర్జాతీయ కన్వెన్షన్‌ సెంటర్‌ కమ్‌ హోటల్‌గా మార్చేందుకు ముందుగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి అప్పగించాలని రక్షణ మంత్రిత్వ శాఖ అంగీకరించింది వాస్తవం కాదా అని విజయసాయిరెడ్డి మరో ప్రశ్నను కేంద్రం ముందుంచారు. దీనిపై స్పందించిన రక్షణ మంత్రిత్వ శాఖ ఆ మేరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొంది. ఐఎన్‌ఎస్‌ విరాట్‌ను  హోటల్‌ కమ్‌ మ్యూజియంగా మార్చడానికి మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతిపాదనకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్టు రక్షణ శాఖ మంత్రి పునరుద్ఘాటించారు.

విశాఖ- రాజమండ్రి మధ్య టోల్‌ వసూళ్లు రూ.1775 కోట్లు
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం-రాజమండ్రి మధ్య జాతీయ రహదారిపై ఉన్న మూడు ప్రధాన టోల్‌ గేట్ల నుంచి ఇప్పటివరకు 1775 కోట్ల రూపాయల వసూలు చేసినట్టు ఉపరితల రవాణా శాఖ సహాయ మంత్రి శ్రీ మన్సుఖ్‌ మాండవీయ సోమవారం రాజ్యసభకు తెలిపారు. వైఎస్సార్‌ సీపీ రాజ్యసభ సభ్యులు వి విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానమిస్తూ.. విశాఖ-రాజమండ్రి మధ్య జాతీయ రహదారిపై అగనంపూడి, వేంపాడు, కృష్ణవరం వద్ద మూడు టోల్‌ గేట్లు ఉన్నట్టు తెలిపారు. జూలై 1998 నుంచి 25 డిసెంబర్‌ 2018 వరకు అగనం పూడి టోల్‌ గేట్‌లో 286.25 కోట్ల రూపాయలు, మే 2005 నుంచి 25 డిసెంబర్‌ 2018 వరకు వేంపాడు టోల్‌ గేట్‌లో 844.99 కోట్ల రూపాయలు, మే 2005 నుంచి 25 డిసెంబర్‌ వరకు కృష్ణవరం టోల్‌ గేట్‌లో 644.23 కోట్ల రూపాయలు టోల్‌ ఫీజు కింద వసూలు చేసినట్టు మంత్రి వెల్లడించారు.

అదే విధంగా ఈ మూడు చోట్ల టోల్‌ ఫీజు వసూలు సమయంలో జాప్యం వల్ల వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న విషయం వాస్తవం కాదా అన్న ప్రశ్నకు మంత్రి లేదని జవాబిచ్చారు. ప్రత్యేక సందర్భాల్లో ట్రాఫిక్‌ పెరిగితే అదనపు సిబ్బందిని పెట్టుకునే బాధ్యత ఒప్పందం ప్రకారం టోల్‌ ఏజెన్సీదేనని అన్నారు. వేంపాడు, కృష్ణవరం టోల్‌ ప్లాజాల వద్ద అదనంగా మరో రెండు లైన్లు విస్తరించుకునే సౌలభ్యం ఉన్నట్టు మంత్రి పేర్కొన్నారు. యూజర్‌ ఫీ నిబంధనల ప్రకారమే వాహనదారుల నుంచి ఫీజుల వసూలు చేయడం జరుగుతుందన్నారు. 
 

మరిన్ని వార్తలు