తమిళనాట పారిశ్రామిక కారిడార్‌  

21 Jan, 2019 09:51 IST|Sakshi
కారిడార్‌ ప్రారంభ కార్యక్రమంలో భాగంగా జ్యోతి ప్రజ్వలన చేస్తున్న సీతారామన్‌

ప్రారంభించిన రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌

రూ. 3,038 కోట్లపైగా పెట్టుబడులు మెజారిటీ పీఎస్‌యూలనుంచే  

ముందుకొచ్చిన లాక్‌ హీడ్‌ మార్టిన్‌ కంపెనీ

ప్రస్తుతానికి ఐదు నగరాలకు పరిమితమం  

మెరుగుపడనున్న ఉపాధి అవకాశాలు

తిరుచిరాపల్లి: రక్షణ సంబంధ పరికరాలు దేశీయంగానే ఉత్పత్తి చేసే దిశగా కేంద్రం అడుగులు వేసింది. తమిళనాడులోని తిరుచిరాపల్లిలో రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆదివారం తమిళనాడు డిఫెన్స్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌ను ప్రారంభించారు. ఈ కారిడార్‌ ప్రారంభోత్సవం సందర్భంగా రూ. 3,038 కోట్ల పైచిలుకు పెట్టుబడులు పెట్టేందుకు వివిధ సంస్థలు ముందుకొచ్చాయి. ఇందులో అత్యధిక భాగం ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ బోర్డు, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్, భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ తదితర ప్రభుత్వ రంగ సంస్థలు పెట్టనున్నాయి. 

ఇక ప్రైవేటు కంపెనీలైన టీవీఎస్, డేటా ప్యాట్రన్స్, అల్ఫా డిజైన్స్‌ తదితర సంస్థలు పెట్టనున్నాయి. ఇందులో తాము కూడా పెట్టుబడులు పెడతామంటూ అంతర్జాతీయ భారీ భద్రతా సంస్థల్లో ఒకటైన లాక్‌హీడ్‌ మార్టిన్‌ ప్రకటించింది. తమిళనాడు డిఫెన్స్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌ను తమిళనాడు డిఫెన్స్‌ ప్రొడక్షన్‌ క్వాడ్‌ అని కూడా పిలవనున్నారు. ఈ కారిడార్‌ జాబితాలో తిరుచిరాపల్లితోపాటు రాజధాని నగరం చెన్నై, హోసూర్, సేలం, కోయంబతూర్‌ కూడా ఉన్నాయి. 

ఈ సందర్భంగా రక్షణ మంత్రి సీతారామన్‌ మాట్లాడుతూ ‘డిఫెన్స్‌ కారిడార్‌కి స్థానిక పరిశ్రమల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. పాలక్కాడ్‌ వరకూ పొడిగించాలంటూ అనేకమంది కోరుతున్నారు. అయితే దీనిని ప్రస్తుతానికి ఈ ఐదు నగరాలకే పరిమితం చేస్తున్నాం’ అని అన్నారు. ఈ కారిడార్‌ వల్ల రక్షణ ఉత్పత్తులు పెరగడమే కాకుండా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. అంతేకాకుండా వివిధ రక్షణ కారిడార్‌ల మధ్య కనెక్టివిటీ బాగా పెరుగుతుందన్నారు. ఈ ఐదు నగరాల్లో ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ బోర్డులు ఉన్నాయని, రక్షణ ఉత్పత్తుల విక్రేతలు ప్రభుత్వ రంగ సంస్థలతోపాటు ఇతర అనుబంధ సంస్థలతో చేయి చేయి కలిపి ఉత్పత్తిని మెరుగుపరుస్తాయి’అని అన్నారు. పారిశ్రామిక కారిడార్‌ ప్రారంభ కార్యక్రమానికి ఐదు వందలమందికిపైగా వివిధ సంస్థల ప్రతినిధులతోపాటు ఉన్నతాధికారులు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రతినిధులు కూడా హాజరయ్యారు.  

గతేడాదే ప్రకటన 
దేశంలో రెండు రణ ఉత్పత్తుల పారిశ్రామిక కారిడార్లను ప్రారంభిస్తామంటూ గతేడాది ఫిబ్రవరి, రెండో తేదీన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించడం తెలిసిందే. అందులోభాగంగా ఒకటి ఉత్తరప్రదేశ్‌లో, మరొకటి తమిళనాడులో మొదలయ్యాయి. తొలుత ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో గతేడాది ఆగస్టు, 11వ తేదీన ఉత్తరప్రదేశ్‌ డిఫెన్స్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌ ప్రారంభించడం తెలిసిందే.

మరిన్ని వార్తలు