‘మౌలిక ప్రాజెక్టుల కోసం ఎన్‌ఐపీ’

31 Dec, 2019 17:38 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అమలు పర్యవేక్షణకు నేషనల్‌ ఇన్‌ఫ్రాస్ర్టక్చర్‌ పైప్‌లైన్‌ (ఎన్‌ఐపీ)ను ఏర్పాటు చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. ఎన్‌ఐపీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రైవేటు రంగ ప్రతినిధులు ఉంటారని చెప్పారు. 2019 స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనకు అనుగుణంగా రానున్న ఐదేళ్లలో రూ 100 లక్షల కోట్లతో చేపట్టాల్సిన మౌలిక ప్రాజెక్టులను టాస్క్‌ఫోర్స్‌ గుర్తించిందని అన్నారు. వీటికి అదనంగా మరో 3 లక్షల కోట్ల పెట్టుబడులను కూడా మౌలిక రంగంలో వెచ్చిస్తామని మంత్రి పేర్కొన్నారు.

ప్రతిపాదిత ఎన్‌ఐపీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 39 శాతం మేర సమాన వాటా కలిగిఉంటాయని చెప్పారు. ప్రైవేట్‌ రంగ వాటా 22 శాతం కాగా 2025 నాటికి ఇది 30 శాతానికి పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. గత నాలుగు నెలలుగా టాస్క్‌ఫోర్స్‌ బృందం మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాలు, మౌలిక రంగ కంపెనీలు, డెవలపర్లతో పలుమార్లు వివిధ అంశాలపై సంప్రదింపులు జరిపిందని మంత్రి వెల్లడించారు. ఎన్‌ఐపీ కింద రూ 25 లక్షల కోట్ల ఇంధన ప్రాజెక్టులు చేపట్టనున్నారని తెలిపారు. 2020 ప్రధమార్ధంలో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ మీట్‌ జరుగుతుందని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు