తొలిసారి ఇల్లు కొంటే రూ.3.5 లక్షల రాయితీ!

5 Jul, 2019 13:36 IST|Sakshi

న్యూఢిల్లీ : మొదటిసారిగా ఇల్లు కొనుగోలు చేసేవారికి ప్రోత్సాహకాలు ఉంటాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. బడ్జెట్‌ ప్రసంగంలో భాగంగా ఇందుకు సంబంధించిన కీలక విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా రూ. 45 లక్షల ఇల్లు కొంటే రూ. 3.5 లక్షల మేర వడ్డీ రాయితీ కల్పిస్తామని పేర్కొన్నారు. అదే విధంగా హోంలోన్‌ తీసుకున్న వారికి మరో లక్షన్నర వడ్డీ రాయితీ ఉంటుందని ప్రకటించారు. పబ్లిక్‌, ప్రైవేట్‌ భాగస్వామ్య ప్రాజెక్టులు పెంచుతామని, ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రైవేట్‌ పెట్టుబడులకు ప్రోత్సాహం అందిస్తామని నిర్మల పేర్కొన్నారు. ఈ క్రమంలో హౌజింగ్‌ ఫైనాన్స్‌ రంగాన్ని  రిజర్వ్‌ బ్యాంక్‌ పరిధిలోకి తీసుకువస్తామని వెల్లడించారు.

అదే విధంగా ఆదాయ పన్ను పరిమితి రూ. 5 లక్షలకు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఏడాదికి రూ. 5 లక్షల ఆదాయం దాటితే పన్ను విధిస్తామని పేర్కొన్నారు. ఇక ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ. 70 వేల కోట్ల మూలధన సహాయం అందించనున్నట్లు వెల్లడించారు. అదే విధంగా డ్వాక్రా మహిళలకు రూ. 5 వేల ఓవర్‌ డ్రాఫ్ట్‌ సదుపాయం కల్పిస్తామన్నారు. ముద్రా పథకం కింద స్వయం సహాయక సంఘాల మహిళలకు లక్ష రుణం అందజేస్తామని వెల్లడించారు. ఇక త్వరలోనే రూ. 1, 2, 5, 10, 20 కొత్త నాణేలు విడుదల కానున్నాయని పేర్కొన్నారు. కాగా  ఆర్థికమంత్రి బడ్జెట్‌ ప్రసంగం ముగిసిన అనంతరం  సభ సోమవారానికి వాయిదా పడింది.

మరిన్ని వార్తలు