‘పాక్‌పై మెరుపు దాడులు అందుకే’

15 Apr, 2019 18:28 IST|Sakshi

బెంగళూర్‌ : పాకిస్తాన్‌ ఉగ్రవాద బాధిత దేశమని ఇస్లామాబాద్‌ చేసిన వ్యాఖ్యలను రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ తోసిపుచ్చారు. తమ భూభాగంలో ఉన్న జైషే మహ్మద్‌ ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేయడంలో పాకిస్తాన్‌ ఎలాంటి చర్యలూ చేపట్టలేదని ఆరోపించారు. కర్నాటకలోని శివమొగ్గలో సోమవారం జరిగిన ఓ ప్రచార ర్యాలీలో ఆమె ప్రసంగిస్తూ పుల్వామా ఉగ్రదాడి, బాలాకోట్‌లో వైమానిక దాడులకు దారితీసిన పరిస్థితులను వివరించారు.

తమది ఉగ్రవాద బాధిత దేశమని చెబుతున్న పాకిస్తాన్‌ పుల్వామా దాడికి బాధ్యత తమదేనని చెప్పిన జైషే మహ్మద్‌పై పాక్‌ ఎందుకు చర్యలు చేపట్టలేదని ఆమె ప్రశ్నించారు. జైషే శిబిరాలపై పాకిస్తాన్‌ చర్యలు చేపట్టకపోవడంతోనే తాము బాలాకోట్‌లో వైమానిక దాడులు తలపెట్టామని చెప్పారు. కాగా, బాలాకోట్‌లో ఐఏఎఫ్‌ చేపట్టిన వైమానిక దాడులపై పలు రాజకీయా పార్టీలు ప్రశ్నలు లేవనెత్తుతున్న నేపథ్యంలో నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కాగా, సాయుధ దళాలను బీజేపీ రాజకీయాల్లోకి లాగుతోందన్న ఆరోపణలను ఇటీవల ఆమె తోసిపుచ్చారు. దేశ భద్రతకు సంబంధించిన అంశాలను ప్రధాని నరేంద్ర మోదీ లేదా ఎన్‌డీఏ నేతలెవరూ రాజకీయం చేయడం లేదని ఆమె స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు