నిర్మలా సీతారామన్‌ను టార్గెట్‌ చేసిన స్వామి

12 Feb, 2018 18:51 IST|Sakshi
బీజేపీ సీనియర్‌ నేత, ఎంపీ సుబ్రమణియన్‌ స్వామి (ఫైల్‌ ఫోటో)

సాక్షి,న్యూఢిల్లీ : కేంద్ర ర‌క్ష‌ణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌పై బీజేపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ ఎంపీ సుబ్రమణియన్‌ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె తన పదవికి  రాజీనామా చేయాలన్నారు.  జమ్మూ కాశ్మీర్ షోపియాన్‌లో సైన్యం కాల్పులు..సామాన్య ప్రజలు మరణించిన  ఘటనలో  మేజర్‌ ఆదిత్యకుమార్‌పై చట్టపరమైన చర్యలపై సుప్రీంకోర్టు మద్యంతర స్టే విధించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సుప్రీం తాజా వ్యాఖ్యల అనంతరం ఆమె రాజీనామా చేయాలని కోరాలన్నారు.

కాల్పులు జరిగిన సమయంలో తన కొడుకు (ఆదిత్య) ఘటనాస్థలంలో లేడని..అతనిపై నమోదైన కేసును కొట్టివేయాలని మేజర్ ఆదిత్యా తండ్రి లెఫ్టినెంట్ కల్నల్ కరమ్‌వీర్ సింగ్ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన సుప్రీం కేసు విచారణఫై సోమవారం మధ్యంతరం స్టే విధించింది.  సైన్యంపై రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌ఐఆర్‌ ఎలా ఫైల్‌ చేస్తుందని ప్రశ్నించింది. అలాగే ఈ  కేసులో తమ వైఖరి వెల్లడించాల్సిందిగా, జమ్ముకశ్మీర్‌ ప్రభుత్వాన్ని, కేంద్రాన్నికోరింది. రెండు వారాల్లో తమ స్పందన తెలియచేయాలని నోటీసులు జారీ చేసింది. దీనిపై సీనియర్ న్యాయవాది ముకుల్ రోహతగి మాట్లాడుతూ ఈ కేసును హైకోర్టులో విచారణ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిందన్నారు. ఎఫ్ఐఆర్‌పై విచారణను ఆపివేయడం తోపాటు.. కర్తవ్య నిర్వహణలో భాగంగా  తీసుకున్న మేజర్‌ ఆదిత్య చర్యపై  కేంద్ర  ప్రభుత్వం లేదా జమ్మూకశ్మీర్ పోలీసులు  యాక్షన్‌ తీసుకోలేవని కోర్టు పేర్కొందని చెప్పారు. మరోవైపు ఇది ఆర్మీకి సానుకూలమైన  ప్రోత్సాహకరమైన రోజంటూ కరమ్‌ంసింగ్ న్యాయవాది ఐశ్వర్య భాటి సంతోషం వ్యక్తం చేశారు.  పిటీషన్‌ కాపీని భారత అటార్నీ జనరల్  కార్యాలయానికి  అందించాలని తమను కోరిందని చెప్పారు.

కాగా జనవరిలో షోపియాన్‌లో ఆందోళనకారులపై కాల్పులు,  ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలో మేజర్ ఆదిత్యాకుమార్‌పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. 


మరిన్ని వార్తలు