ముంబైకి తప్పిన ముప్పు

4 Jun, 2020 05:04 IST|Sakshi
వర్షపునీటితో నిండిన ముంబై ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ అవుతూ రన్‌వే పైనుంచి జారి పక్కకు వెళ్లిన ఫెడెక్స్‌ విమానం

ఆలీబాగ్‌ సమీపంలో తీరం దాటిన నిసర్గ

సాయంత్రానికి బలహీనపడిన తుపాను  

సాక్షి ముంబై/అహ్మదాబాద్‌:  దేశ ఆర్థిక రాజధాని ముంబైకి నిసర్గ తుపాను ముప్పు తప్పింది. ఈ తుపాను బుధవారం మహారాష్ట్రలోని రాయిగఢ్‌ జిల్లా ఆలీబాగ్‌ సమీపంలో తీరం దాటిన అనంతరం దిశను మార్చుకుని ఉరణ్, పన్వెల్, పుణే, నాసిక్‌ మీదుగా ముందుకు వెళ్లిపోయింది. దీంతో ముంబైవాసులతోపాటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఆలీబాగ్‌ సమీపంలో తీరాన్ని తాకే సమయానికి ముంబైలో భారీ వర్షం కురవనప్పటికీ బలమైన ఈదురుగాలులు వీచాయి. పలు ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి.

నిసర్గ తుపాను కారణంగా రాయిగఢ్‌ జిల్లాతోపాటు రత్నగిరి జిల్లాలో పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. వివిధ గ్రామాల్లో ఇళ్లు, భవనాల పైకప్పులు గాలికి కొట్టుకుపోయా యి. అనేక ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. నిసర్గ తుపాను ఇద్దరిని బలితీసుకుంది. బుధవారం రాయిగఢ్‌ జిల్లాలో ఒకరు, పుణే జిల్లా లో ఒకరు మరణించినట్టు తెలిసింది. మహారాష్ట్రలోని కోస్తా  ప్రాంతాలతోపాటు దక్షిణ గుజరాత్‌లో వేలాది మందిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నిసర్గ ప్రభావంతో గుజరాత్‌లో ఇప్పటిదాకా పెద్దగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు ప్రకటించారు. 63,700 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు.     
 
బలహీన పడిన తుపాను
మహారాష్ట్ర తీర ప్రాంతంలోకి అడుగుపెట్టిన నిసర్గ తుపాను బుధవారం సాయంత్రానికల్లా బలహీనపడిందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ప్రకటించింది. ప్రస్తుతం గంటకు 65–75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ ఈ తుపాను తీవ్రత తగ్గుముఖం పట్టిందని సాయంత్రం 6.30 గంటలకు విడుదల చేసిన బులెటిన్‌లో తెలియజేసింది. అర్ధరాత్రికల్లా మరింత బలహీనపడే అవకాశం ఉందని వివరించింది.  

మరిన్ని వార్తలు