నేను పరమశివుణ్ణి.. నన్నెవరూ టచ్‌ చేయలేరు!

8 Dec, 2019 12:15 IST|Sakshi

న్యూఢిల్లీ: అత్యాచారం కేసులతో పాటు పలు ఆరోపణలు ఎదుర్కొంటూ దేశం వదిలి పారిపోయిన వివాదాస్పద స్వామీజీ నిత్యానంద.. తనను ఎవ్వరూ టచ్ చేయలేరంటూ చేసిన వ్యాఖ్యల వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆధ్యాత్మిక గురువుగా చలామణి అవుతూ అనేక అరాచకాలకు పాల్పడుతున్నాడని నిత్యానందపై ఆరోపణలున్నాయి. నిత్యానందపై ఇప్పటికే ఎన్నో కేసులున్నాయి. లెక్కలేనన్ని వివాదాలున్నాయి. కేసుల భయంతో ఎక్కడ తలదాచుకున్నాడో కూడా తెలియదు. కానీ.. తాజాగా బయటకు వచ్చిన ఓ వీడియోలో మాత్రం తనను ఎవ్వరూ టచ్‌ చేయలేరని నిత్యానంద పేర్కొన్నారు.

ఆ వీడియోను పరిశీలిస్తే.. 'నన్ను ఎవ్వరూ టచ్ చేయలేరు.. ఏ స్టుపిడ్‌ కోర్టు నన్ను ప్రాసిక్యూట్ చేయలేదు.. నేను పరమశివుడిని.. నేను నిజం చెప్పగలను.. మీ ముందు నా నిజాయితీని నిరూపించుకోగలను' అంటూ తన శిష్యగణాన్ని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించాడు. అయితే, అది ఎక్కడ? ఏ సందర్భంలో మాట్లాడారు అనేది మాత్రం స్పష్టంగా తెలియదు.. కానీ, ఆ వీడియో మాత్రం వైర్‌గా మారిపోయింది.

"No judiciary can touch me. M param shiva"
: #NithyanandaSwami from an undisclosed location. pic.twitter.com/WXdZ6bGCdO

వివాదస్పద స్వామిజీ నిత్యానందకు తమ దేశం ఆశ్రయం కల్పించిందనే వార్తలపై ఈక్వెడార్‌ రాయబార కార్యాలయం స్పందించింది. ఆ వార్తలో ఏ మాత్రం వాస్తవం లేదని స్పష్టం చేసింది. ఆశ్రయం కోసం నిత్యానంద చేసుకున్న శరణార్థి దరఖాస్తును తమ ప్రభుత్వం తిరస్కరించినట్టు తెలిపింది. దీంతో అతను ఈక్వెడార్‌ నుంచి హైతీ వెళ్లాడని చెప్పింది. ఈక్వెడార్‌ నుంచి నిత్యానంద ద్వీపం కొనుగోలు చేసాడని వస్తున్న వార్తలను ఖండించింది.

నిత్యానందకు తాము ఎలాంటి సాయం చేయలేదని వెల్లడించింది. నిత్యానందకు చెందిన కైలాస వెబ్‌సైట్‌లోని సమాచారం ఆధారంగా పలు కథనాలు వెలువడ్డాయని.. అందులో వాస్తవాలు లేవని తెలిపింది. నిత్యానందకు సంబంధించిన విషయాల్లో ఈక్వెడార్‌ పేరును వాడటం మానుకోవాలని మీడియాను కోరింది. కాగా, ఈక్వెడార్‌ నుంచి తాను ఒక చిన్న ద్వీపాన్ని కొనుగోలు దానికి కైలాస పేరుపెట్టినట్టు ఇటీవల నిత్యానంద ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఓ వెబ్‌సైట్‌ను కూడా అందుబాటులోకి తెచ్చారు. కైలాస అనేది రాజకీయేతర హిందూ దేశమని, హిందూత్వ పునరుద్ధరణ కోసం కృషి​ చేస్తోందని అందులో పేర్కొన్నారు. ప్రస్తుతం అత్యాచారం సహా పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద తనను కాపాడుకోవడానికి విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే. 

చదవండి: నిత్యానంద దేశానికి ప్రధానిగా తమిళనటి?

మరిన్ని వార్తలు