అవినీతి అంతం కోసమే.. నోట్ల రద్దు

30 Nov, 2018 22:20 IST|Sakshi
రాజీవ్‌ కుమార్‌

నీతి ఆయోగ్‌ వైస్‌చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌

సాక్షి, న్యూఢిల్లీ: అవినీతిని అంతమొందించాలనే లక్ష్యంతోనే కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిందని నీతి ఆయోగ్‌ వైస్‌చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ స్పష్టం చేశారు. ఆర్థిక వృద్ధి కోసం కాదని ఆయన వివరించారు. దేశ రాజధానిలో శుక్రవారం నిర్వహించిన భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) హెల్త్‌ సమ్మిట్‌లో ఆయన ప్రసంగించారు. ‘సుబ్రమణియన్‌ నివేదిక చదివాను. అందులో ఆర్థిక వికాసానికి నోట్ల రద్దు వ్యతిరేకంగా ఉందని రాశారు. అయితే సుబ్రమణియన్‌ ఈ పదాన్ని ఎందుకు వాడారో నాకు తెలియదు. ఇది కేవలం అవినీతిపరులకు, అక్రమంగా నగదు దాచుకున్నవారికి వ్యతిరేకంగా తీసుకున్న చర్య మాత్రమేఆర్థిక వికాసం గురించి తెలిసినవారు నిజాయతీపరులై ఉంటారు, చట్టానికి కట్టుబడి ఉంటా’రని రాజీవ్‌కుమార్‌ పేర్కొన్నారు.

కాగా పెద్ద నోట్ల రద్దు దారుణమని, ఇది  ఆర్ధిక వృద్ధికి పెనుప్రమాదమని ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్‌ సుబ్రమణియన్‌ గురువారం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. గతంలో ప్రధాన ఆర్థిక సలహాదారుడిగా పనిచేసిన అరవింద్‌...నోట్లరద్దు తదనంతర పరిణామాలపై ఆరు నెలలు అధ్యయనం చేశారు. దీనిపై ఆయన స్పందిస్తూ ఏడు త్రైమాసికాల్లో వృద్ధి రేటు 6.8 శాతానికి పడిపోయిందన్నారు. గతంలో ఇది ఎనిమిది శాతంగా ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. 
 

మరిన్ని వార్తలు