భారత్‌లో తీవ్రమైన నీటి ఎద్దడి

15 Jun, 2018 04:52 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత చరిత్రలోనే తొలిసారిగా దేశం దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటోందని నీతి ఆయోగ్‌ వెల్లడించింది. ఈ పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతోందని ‘కంపోజిట్‌ వాటర్‌ మేనేజ్‌మెంట్‌ ఇండెక్స్‌’ పేరుతో గురువారం విడుదల చేసిన నివేదికలో స్పష్టం చేసింది. ‘ప్రస్తుతం దేశంలో 60కోట్ల మంది తీవ్రమైన నీటి కొరతతో ఉన్నారు. సరైన తాగునీరు లేనికారణంగా ఏటా 2లక్షల మంది చనిపోతున్నారు’ అని ఈ నివేదికలో నీతిఆయోగ్‌ పేర్కొంది.

ఇప్పటినుంచే దేశంలో జలవనరులు, వాటి వినియోగంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని గుర్తుచేసింది. ‘2030 కల్లా దేశంలో నీటి సరఫరాకు రెట్టింపుగా డిమాండ్‌ ఉండబోతుంది. దేశ ప్రజలందరికీ నీటి కొరత తప్పేట్లులేదు. దీని కారణంగా జీడీపీ 6 శాతానికి పడిపోతుంది’ అని ఈ నివేదిక విడుదల సందర్భంగా కేంద్ర జలవనరుల మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. 122 దేశాల్లోని పరిస్థితుల ఆధారంగా వివిధ అంతర్జాతీయ సంస్థలు సిద్ధం చేసిన నీటి నాణ్యత సూచీలో భారత్‌ 120వ స్థానంలో ఉండటం.. దేశంలోని 70% నీరు కలుషితమవడాన్నీ ఈ నివేదిక పేర్కొంది. 2030 కల్లా ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్‌ సహా 21 నగరాల్లో భూగర్భజలాలు అడుగంటిపోతాయని.. దీంతో 10కోట్ల మందిపై ప్రభావం ఉంటుందంది. 

మరిన్ని వార్తలు