కరోనా కట్టడి : త్వరలోనే మహమ్మారికి చెక్‌

3 May, 2020 18:00 IST|Sakshi

దశలవారీగా లాక్‌డౌన్‌కు సడలింపులు మేలు

సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా వైరస్‌ కేసుల సంఖ్య పెరుగుదలలో కొద్దిరోజుల్లోనే నిలకడ రావచ్చని నీతిఆయోగ్‌ సభ్యులు వీకే పాల్‌ అన్నారు. తొలి, రెండు దశల్లో ఇచ్చిన సడలింపుల ఫలితాలను కొనసాగించేందుకే ప్రభుత్వం మరో రెండు వారాల పాటు లాక్‌డౌన్‌ పొడిగింపునకు మొగ్గుచూపిందని అన్నారు. వైరస్‌ చైన్‌ను నిలువరించడమే లాక్‌డౌన్‌ ఉద్దేశమని, మధ్యలోనే లాక్‌డౌన్‌ను విరమిస్తే ఆ ఉద్దేశం నీరుగారుతుందని వ్యాఖ్యానించారు. అదే సమయంలో వైరస్‌ ఉనికి లేని ప్రాంతాల్లో అత్యంత జాగరూకతతో సడలింపులు ప్రకటించాలని కరోనా కట్టడికి సంబంధించి వైద్య పరికరాలు, నిర్వహణ ప్రణాళికా సాధికార గ్రూపునకు నేతృత్వం వహిస్తున్న పాల్‌ పేర్కొన్నారు.

చదవండి : వీళ్లు మ‌ర‌ణించే అవ‌కాశం ప‌దిరెట్లు ఎక్కువ‌

భారత్‌లో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో సమూహ వ్యాప్తి దశకు చేరుకుందా అన్న ప్రశ్నకు బదులిస్తూ ఆ దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉన్నా ఇప్పటికీ నిరోధించే వ్యూహాన్ని అమలు చేయడం సాధ్యమేనని అన్నారు. లాక్‌డౌన్‌కు ముందు కరోనా కేసుల తీవ్రతతో పోలిస్తే ఇప్పుడు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుదల పెద్దగా లేదని చెప్పుకొచ్చారు. లాక్‌డౌన్‌ ముందు దశలో కేసుల సంఖ్య కేవలం ఐదు రోజుల్లో రెట్టింపవగా, తర్వాత ప్రతి మూడు రోజులకూ కేసులు రెట్టింపయ్యాయని, ఇప్పుడు అది 11-12 రోజులకు పెరిగిందని గుర్తుచేశారు. వైరస్‌ వ్యాప్తి మొత్తంగా తగ్గిందని, అయితే కేసుల సంఖ్యలో ఇంకా నిలకడ రాలేదని, ఇది ఎప్పటికైనా కుదురుకుంటుందని చెప్పారు. కాగా దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 39,980కి చేరుకోగా మరణాల సంఖ్య 1301కి పెరిగింది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా