సివిల్స్‌కు 27 ఏళ్లే!

21 Dec, 2018 04:01 IST|Sakshi

గరిష్ట వయోపరిమితి 30 ఏళ్ల నుంచి కుదించాలి

దిగువ కోర్టుల్లో జడ్జీల ఎంపికకు ఒకే పరీక్ష

నీతి ఆయోగ్‌ కీలక ప్రతిపాదనలు

న్యూఢిల్లీ: సివిల్‌ సర్వీసెస్‌ అర్హత పరీక్ష వయో పరిమితి తగ్గింపుతోపాటు దిగువ కోర్టుల్లో జడ్జీల ఎంపికపై కేంద్ర ప్రభుత్వ ‘థింక్‌ ట్యాంక్‌’ నీతి ఆయోగ్‌ పలు కీలక చర్యలను ప్రతిపాదించింది. 2022–23 సంవత్సరానికి సాధించాల్సిన లక్ష్యాలను, చేపట్టాల్సిన చర్యలతో కూడిన ‘స్ట్రాటజీ ఫర్‌ న్యూ ఇండియాః75’ పత్రాన్ని నీతి ఆయోగ్‌ ఇటీవల విడుదల చేసింది. ‘సివిల్‌ సర్వీసెస్‌ జనరల్‌ కేటగిరీ అభ్యర్థుల గరిష్ట వయో పరిమితిని 30 ఏళ్ల నుంచి 2022–23కల్లా దశలవారీగా 27 ఏళ్లకు తగ్గించాలి.

ప్రస్తుతమున్న 60కి పైగా కేంద్ర, రాష్ట్ర సర్వీసులను హేతుబద్ధీకరణ ద్వారా తగ్గించాల్సిన అవసరం ఉంది. ఉద్యోగ అవసరాలు, కావల్సిన నైపుణ్యాన్ని బట్టి సెంట్రల్‌ పూల్‌ నుంచే అభ్యర్థుల కేటాయింపు జరగాలి. దీనివల్ల సివిల్‌ సర్వీసెస్‌లో ఆల్‌ ఇండియా ర్యాంకు ఆధారంగా ఒక్క పరీక్ష నిర్వహిస్తే సరిపోతుంది. ఈ సెంట్రల్‌ పూల్‌ను వినియోగించుకునేలా రాష్ట్రాలను ప్రోత్సహించాలి. అంతేకాకుండా, సివిల్‌ సర్వీసెస్‌లో సంస్కరణలు నిరంతరం కొనసాగాలి. ఈ దిశగా ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు తీసుకుంది’ అని నీతి ఆయోగ్‌ ఆ పత్రంలో తెలిపింది.

జడ్జీల ఎంపికకు ఆల్‌ ఇండియా పరీక్ష
దిగువ కోర్టుల్లో న్యాయమూర్తుల పోస్టుల భర్తీకి దేశ వ్యాప్తంగా ఒకే ఎంపిక నిర్వహించాలని నీతి ఆయోగ్‌ సూచించింది. ప్రతిభావంతులైన యువ న్యాయ అధికారులను ప్రోత్సహించేందుకు, వారిలో జవాబుదారీతనం పెంచేందుకు ఈ చర్య దోహదపడుతుందని అభిప్రాయపడింది. ‘అఖిల భారత స్థాయిలో నిర్వహించే ర్యాంకింగ్‌ ఆధారిత పరీక్ష వల్ల న్యాయవ్యవస్థలో ఉన్నత ప్రమాణాలను నెలకొల్పవచ్చు.

దిగువ స్థాయి కోర్టుల్లో జడ్జీలకు, కేంద్ర, రాష్ట్ర న్యాయ సేవల విభాగాలు, ప్రాసిక్యూటర్లు, న్యాయ సలహాదారులు తదితర అభ్యర్థుల ఎంపిక బాధ్యతలను యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిష¯Œ  (యూపీఎస్‌సీ)కు అప్పగించాలి. దీనివల్ల జవాబుదారీతనం పెరుగుతుంది. న్యాయ వ్యవస్థ స్వతంత్రతను కాపాడేందుకుగాను ఆయా పోస్టులకు ఎంపికైన వారంతా సంబంధిత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది’ అని ఆ పత్రంలో నీతి ఆయోగ్‌ పేర్కొంది. జడ్జీల పనితీరును ఎప్పటికప్పుడు మదింపు చేసేందుకు రాష్ట్రాలవారీగా సూచికలు తయారు చేయాలంది.

సత్వర న్యాయం కోసం కోర్టుల్లో వీడి యో కాన్ఫరెన్స్‌ సౌకర్యాన్ని కల్పించడంతోపాటు, వినియోగం కూడా పెరగాల్సిన అవసరం ఉందని తెలిపింది.ప్రస్తుతం జడ్జీల ఎంపిక కోసం వివిధ రాష్ట్రాల్లోని హైకోర్టులు, సివిల్‌ సర్వీస్‌ కమిషన్లు పరీక్షలు చేపడుతుండగా అఖిల భారత స్థాయిలో ఈ పరీక్షలను చేపట్టాలన్న ప్రతిపాదన 1960ల నుంచే ఉంది. అయితే, దీనిని తొమ్మిది హైకోర్టులు తిరస్కరించగా 8 హైకోర్టులు పలు మార్పులను ప్రతిపాదించాయి. అయితే, నీట్‌ లాగానే దేశవ్యాప్తంగా జడ్జీల ఎంపిక పరీక్ష చేపట్టాలన్న ఆలోచనను ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం మరోసారి తెరపైకి తెచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న దిగువస్థాయి న్యాయస్థానాల్లో 20,502 పోస్టులకు గాను 2015 నాటికి 16,050మంది మాత్రమే పనిచేస్తున్నారు.

మరిన్ని వార్తలు