యువ నిపుణులకు నీతి ఆయోగ్ భారీ వేతనాలు

17 Aug, 2015 07:09 IST|Sakshi
యువ నిపుణులకు నీతి ఆయోగ్ భారీ వేతనాలు

న్యూఢిల్లీ: ప్రతిభావంతులైన యువ నిపుణులను ఆకర్షించేందుకు మునుపటి ప్రణాళికా సంఘం అందించిన దాని కంటే 30 శాతం ఎక్కువగా వేతనం ఇవ్వాలని నీతి ఆయోగ్ ప్రతిపాదించింది. స్వతంత్ర భారత ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేసిన ప్రణాళిక సంఘం స్థానంలో నీతి ఆయోగ్‌ని కేంద్రం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 20 మంది యువ నిపుణుల కోసం నీతి ఆయోగ్ రిక్రూట్‌మెంట్ ప్రారంభించింది. వీరికి నెలకు రూ.40,000- రూ.70,000 వేతనం అందించనుంది.

ప్రణాళిక సంఘం నెలకు రూ.31,000-రూ.51,000 వేతనం అందించగా, అందుకు 30 శాతం ఎక్కువగా నీతి ఆయోగ్ అందించనుండడం విశేషం. దీంతో పాటు వయోపరిమితిని కూడా 40 ఏళ్ల నుంచి 32 ఏళ్లకు తగ్గించినట్లు అధికారులు వెల్లడించారు. భారత ఆర్థిక వ్యవస్థ పరిస్థితులను పరిశీలించేందుకు చీఫ్ ఎకనమిస్ట్ కోసం కూడా నీతి ఆయోగ్ అన్వేషిస్తోంది.

మరిన్ని వార్తలు