400 జిల్లాల్లో మహమ్మారి జాడ లేదు..

8 Apr, 2020 18:07 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా దాదాపు 400 జిల్లాల్లో కోవిడ్‌-19 ఉనికి లేదని నీతిఆయోగ్‌ ఉపాధ్యక్షులు రాజీవ్‌ కుమార్‌ పేర్కొన్నారు. మహారాష్ట్ర సహా మరికొన్ని రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విజృంభించినా 400 జిల్లాల్లో దీని జాడ లేకపోవడం ఆశాకిరణంలా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ముంబై మహానగరం కరోనావైరస్‌కు కేంద్రంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం మొత్తం పాజిటివ్‌ కేసుల్లో 80 శాతం ఉన్న 62 జిల్లాల్లో లాక్‌డౌన్‌ను పొడిగించవచ్చని భావిస్తున్నారు. కాగా, ఈ వారాంతంలోగా మహమ్మారి కట్టడికి పదునైన వ్యూహం రూపొందించాల్సిన అవసరం ఉందని రాజీవ్‌ కుమార్‌ పేర్కొన్నారు.

ఏప్రిల్‌ 14తో లాక్‌డౌన్‌ ముగుస్తున్న క్రమంలో లాక్‌డౌన్‌ విరమణకు అనుసరించాల్సిన వ్యూహాలపై రాష్ట్రాలతో కేంద్రం​ చర్చలు జరుపుతోందని ఆయన వెల్లడించారు. లాక్‌డౌన్‌ విరమణ వ్యూహాన్ని రూపొందించి అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాలదే కీలక పాత్ర ఉంటుందని చెప్పుకొచ్చారు. ఈ ప్రణాళికపై జిల్లా అధికార యంత్రాంగాలు దృష్టిసారించాల్సి ఉంటుందని అన్నారు. ప్రాణాంతక వైరస్‌ కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకెళ్లాలని చెప్పారు. ప్రజల ప్రాణాలు..వారి జీవనోపాధి మధ్య సరైన సమతూకం పాటించేలా అధికారులు వ్యవహరించాలని ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ ఆయన పేర్కొన్నారు.

చదవండి : క‌రోనా : కూతుర్ని ద‌గ్గ‌ర‌కు తీసుకోలేక‌..

మరిన్ని వార్తలు