కనీస ఆదాయ పధకం అమలు అసాధ్యం : నీతి ఆయోగ్‌

25 Mar, 2019 19:41 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : తాము అధికారంలోకి వస్తే దేశంలోని ఐదు కోట్ల పేద కుటుంబాలకు వారి బ్యాంకు ఖాతాల్లో ఏటా రూ 72,000 జమ చేస్తామని కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ చేసిన ప్రకటనపై నీతి ఆయోగ్‌ పెదవివిరిచింది. ఈ పధకానికి బడ్జెట్‌లో 13 శాతం నిధులు అవసరమవుతాయని, దీని అమలు అసాధ్యమని నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ స్పష్టం చేశారు.

పనిచేయకుండా ఎవరికైనా భారీగా నగదు బదిలీ చేయడం ఆర్థిక క్రమశిక్షణా రాహిత్యానికి దారితీస్తుందని ఈ పధకం ఎన్నడూ అమలుకు నోచుకోదని పెదవివిరిచారు. జీడీపీలో రెండు శాతం, బడ్జెట్‌లో 13 శాతం కనీస ఆదాయ హామీ పధకానికి ఖర్చవుతాయని, ఇంతటి వ్యయంతో వీటిని అమలు చేస్తే ప్రజల వాస్తవ అవసరాలు మరుగునపడతాయని ఆందోళన వ్యక్తం చేశారు.

కాగా, కాంగ్రెస్‌ పార్టీ 1971లో గరీబీ హఠావో, 2008లో ఒన్‌ ర్యాంక్‌ ఒన్‌ పెన్షన్‌, 2014లో ఆహార భద్రత నినాదాలతో ఎన్నికల సమరాంగణంలో నిలిచినా వాటి అమలు మాత్రం సాధ్యం కాలేదన్నారు. కాంగ్రెస్‌ ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన కనీస ఆదాయ హామీ పధకానికీ ఇదే గతి పడుతుందని ఆయన ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు