ఆశలన్నీ అగ్గిపాలు

20 Jul, 2014 00:08 IST|Sakshi
ఆశలన్నీ అగ్గిపాలు

అంధేరి అగ్నిప్రమాదంలో నితిన్ బలి
శోకసంద్రంలో కుటుంబ సభ్యులు

సాక్షి, ముంబై : ఆశలన్నీ కాలిబూడిదయ్యాయి. అంధేరిలో జరిగిన అగ్ని ప్రమాదంలో విధులు నిర్వహిస్తూ మృతి చెందిన అగ్నిమాపక శాఖ జవాను నితిన్ ఐవాల్కర్ (34) ఇప్పుడిప్పుడే జీవితంలో స్థిరపడుతున్నాడు. పదేళ్ల క్రితం  ముంబై అగ్నిమాపక శాఖలో ఉద్యోగం ప్రారంభించాడు. ఇప్పటి దాకా సాఫీగానే సాగింది. జీవితం.  ఓ ఇల్లు కట్టుకున్నాడు. గృహప్రవేశం చేయాలని నిర్ణయించుకున్నాడు. బంధువులందరికీ సమాచారం ఇచ్చేదే మిగిలింది.. ఇంతలోనే అగ్నిరూపంలో మృత్యువు ఆయన ప్రాణాలనే బుగ్గిచేసింది.  ఆయన కుటుంబ సభ్యులను విషాధంలో ముంచెత్తింది.
 
 వివరాలిలా ఉన్నాయి..అంధేరీ లింకురోడ్డపైనున్న 22 అంతస్తుల లోటస్ బిజినెస్ పార్క్ భవనానికి శుక్రవారం ఉదయం మంటలు అంటుకున్న విషయం తెలిసిందే. మంటలను ఆర్పివేసే ప్రయత్నంలో నితిన్ ఊపిరాడక మృతి చెందాడు. మాలేగావ్‌కు చెందిన నితిన్ ఐదు సంవత్సరాలుగా విరార్‌లోని బోలింజ్ ప్రాంతంలో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. వారం, పది రోజుల కిందటే భార్య, ఇద్దరు పిల్లలతో సొంత కొత్త ఫ్లాట్‌లోకి గృహప్రవేశం చేశారు. కొత్త ఇంటిని అందంగా అలంకరించుకోవాలని అనుకున్నారు. దీనికి ముందు సత్యనారాయణ వ్రతం  కార్యక్రమాన్ని చేసి మిత్రులను, బంధువులందరిని ఆహ్వానించాలని నిర్ణయించారు. కానీ ఆయన కోరిక నెరవేరకుండానే పోయింది.
 
 అగ్నిమాపక శాఖలో పదేళ్లుగా..
 గత 10 సంవత్సరాల నుంచి ఆయన ముంబై అగ్నిమాపక శాఖలో పనిచేస్తున్నారు. తండ్రి మహానగర పాలక సంస్థ (బీఎంసీ)లో పనిచేసేవారు. తండ్రి మరణించిన తరువాత వారసత్వ నష్ట పరిహారం కింద నితిన్‌కు అగ్నిమాపక శాఖలో ఉద్యోగం లభించింది. ఆయనకు భార్య శుభాంగీ, ఆరేళ్ల కూతురు సుహా, రెండేళ్ల కూతురు సాన్వీ ఉన్నారు. నితిన్ కుటుంబానికి రూ.15 లక్షల నష్టపరిహారం అందజేయనున్నట్లు సీతారాం కుంటే, మేయర్ సునీల్ ప్రభు ప్రకటించారు.
 
మృతుని కుటుంబానికి ఉద్యోగం

అగ్నిమాపక జవాన్ నిత్‌న్ ఐవాల్కర్ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం, నష్టపరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది.  శుక్రవారం అంధేరీలోని లోటస్ బిజినెస్ పార్క్ ఘటనలో నితిన్ మృతి చెందిన సంగతి  తెలిసిందే. డిమాండ్లపై స్పందించేదాక మృతదేహన్ని తీసుకెళ్లమని శనివారం బైకుల్లా ఫైర్ స్టేషన్ ఎదుట అతడి కుటుంబ సభ్యులు, భార్య శుభాంగీ  భీష్మించుకున్నారు.  ఈ మేరకు ప్రభుత్వం స్పందించినట్లు అధికారులు ప్రకటించారు. కుటుంబ సభ్యులు రూ. 50 లక్షలు నష్టపరిహారం చెల్లించాలనే డిమాండ్ సాధ్యం కాదని  పేర్కొన్నారు.
 
రూ. 30 లక్షలను మున్సిపల్ కార్పొరేషన్ అందజేయనున్నదని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన విషయాలను పరిశీలించిన తర్వాత మొత్తాన్ని అందజేయనున్నట్లు అగ్నిమాపక ప్రధానాధికారి ఏఎన్ వర్మ తెలిపారు. ‘తనకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారని, వారి చదువులు, వారికి ఆసరా అయ్యేందుకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని’ నితిన్ భార్య డిమాండ్ చేశారు. నష్టపరిహారం, తనకు తగిన ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చిన తర్వాతనే మృతదేహాన్ని తీసుకెళ్లినట్లు చెప్పారు.

>
మరిన్ని వార్తలు