భారీ చలాన్లు, నితిన్‌ గడ్కరీ కీలక వ్యాఖ్యలు

10 Sep, 2019 08:53 IST|Sakshi

నా  కారుకు చలాన్‌ పడిందిగా - కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ

అవినీతికి తావులేదు..కెమెరాలున్నాయి

ప్రమాదాల నివారణకే ఈ కొత్త నిబంధనలు

సాక్షి, న్యూఢిల్లీ:  కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మోటార్‌ వాహన సవరణ చట్టం-2019 వల్ల ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారు భారీ జరిమానాల బారిన పడుతున్నారు. దీనిపై ఒకవైపు భారీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ఈ నెలనుంచి అమల్లోకి వచ్చిన ట్రాఫిక్ ఉల్లంఘనలు,భారీ చలాన్లను సమర్థిస్తూ కేంద్ర రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. నిబంధనల ఉల్లంఘనకుగాను తన వాహనానికి కూడా జరిమానా విధించినట్లు సోమవారం వెల్లడించారు. 

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం 100 రోజుల పాలనపై  విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, నితిన్‌ గడ్కరీ ఈ విషయాన్ని వెల్లడించారు. తన పేరు మీద నమోదైన కారును అతి వేగంగా నడిపినందుకు ముంబైలోని బంద్రా-వర్లీ ప్రాంతంలో జరిమానా విధించారన్నారు. అంతేకాదు బాగా జరిమానాలు అవినీతి పెరగడానికి దారితీస్తుందనే ఆందోళనలను మంత్రి తోసి పుచ్చారు. అవినీతి పెరుగుతుందని అంటున్నారు..ఎలా జరుగుతుంది? తాము ప్రతిచోటా కెమెరాలను ఏర్పాటు చేసాము కదా అని కేంద్రమంత్రి పేర్కొనడం గమనార్హం. మోటార్ వెహికిల్ సవరణల చట్టం తీసుకురావడం పట్ల తమ ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. భారీ జరిమానాల కారణంగా అవినీతి తగ్గుతుందని.. రోడ్డు ప్రమాదాల సంఖ్య కూడా చాలా వరకు నియంత్రించవచ్చన్నారు. అంతేకాదు ట్రాఫిక్ నిబంధనలు పాటించేవారు జరిమానాలకు భయపడాల్సిన అవసరం లేదని ఆయన చెప్పుకొచ్చారు. 

ఇది ఇలా వుంటే భారీ జరిమానాలపై సామాన్యుల నుంచి రాజకీయనేతల దాకా తీవ్ర వ్యతిరేకత వస్తోంది.  దీనికితోడు గతంలో ఎప్పుడో పెండింగ్‌లో ఉన్న చలాన్లకు కూడా డబ్బులు వసూలు చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. తమ వాహనాల ఖరీదుకు మించి చలాన్ల వడ్డింపు వుండటంతో ఏం చేయాలో తెలియక వాహనదారులు ఆందోళన పడుతున్నారు. కొందరైతే ఫైన్ చెల్లించలేక తమ వాహనాలను పోలీసుల వద్దే వదిలేసి వెళుతున్నారు. వాహనానికి నిప్పు పెట్టిన ఉదంతం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా