మాల్యాకు మద్దతిచ్చిన కేంద్ర మంత్రి

14 Dec, 2018 13:22 IST|Sakshi

న్యూఢిల్లీ : బ్యాంకులకు చెల్లించాల్సిన రూ. 9,000 కోట్లకు పైగా బకాయిల్ని ఎగ్గొట్టి విదేశాలకు పరారైన లిక్కర్‌బ్యారన్‌ విజయ్‌ మాల్యాను ఇండియాకు రప్పించడం కోసం మోదీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంటే.. మరో పక్క కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ విజయ్‌ మాల్యా గురించి సంచనల వ్యాఖ్యలు చేశారు. ‘మాల్యా దాదాపు నలభై ఏళ్ల పాటు ఈ దేశంలో పన్నులు కడుతూ వస్తున్నారు. కేవలం ఒక్కసారి లోన్‌ కట్టనంత మాత్రాన ఆయనను దొంగ అనడం సరికాదు’ అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.

ఓ ప్రముఖ ఆంగ్ల మీడియా సంస్థతో మాట్లాడిన నితిన్‌ గడ్కరీ.. ‘విజయ్‌ మాల్యాకు, నాకు మధ్య ఎటువంటి వ్యాపార లావాదేవీలు లేవు. కానీ ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. ఓ వ్యక్తి 50 ఏళ్ల పాటు వడ్డీ చెల్లిస్తున్నాడు. కేవలం ఒకసారి ఇంట్రెస్ట్‌ చెల్లించనంత మాత్రాన అతన్ని ఎగవేతదారుడు అనలేము కదా. విజయ్‌ మాల్యా విషయంలో కూడా అదే జరిగింది. 40 ఏళ్ల క్రితం మహారాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ సికోమ్‌ మాల్యాకు రుణం ఇచ్చింది. టైమ్‌కు డబ్బు కట్టేవారు.. ఒక్కసారి కూడా వాయిదా పడలేదు. కానీ విమానయాన రంగంలోకి ప్రవేశించిన తర్వాత ఆయన పరిస్థితి దిగజారింది. దాంతో డబ్బు చెల్లించలేకపోయారు. అంత మాత్రం చేత ఆయనను దొంగ అనడం సరి కాదు. ఈ మైండ్‌సెట్‌ని మార్చుకోవాలం’టూ వ్యాఖ్యానించారు.

అంతేకాక వ్యాపారం అన్నాక ఎత్తు, పల్లాలుంటాయి. ఆర్థిక మాంద్యం వల్లనో.. అంతర్గత కారణాల వల్లనో ఇబ్బందులు వస్తాయి. అలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి బాసటగా నిలవాలి తప్ప ఇలా గేలి చేయకూడదన్నారు. రాజకీయాల్లో కానీ, వ్యాపారంలో కానీ ఓడిపోతే.. అక్కడితో వారి జీవితం ముగిసినట్లు కాదని పేర్కొన్నారు. నీరవ్‌ మోదీ, విజయ్‌ మాల్యా లాంటి వ్యక్తుల ఆర్థిక మోసాలు నిజమైతే వారిని జైలుకు పంపాలి.. అంతేకాని వారిని దొంగ అనే హక్కు మనకు లేదని తెలిపారు. కేవలం వీరి వల్లనే మన ఆర్థిక వ్యవస్థ కుంటుపడలేదంటూ నితిన్‌ గడ్కరీ చెప్పుకొచ్చారు. 

మరిన్ని వార్తలు