ఇంధన దిగుమతులతోనే సంక్షోభ సెగలు..

4 Oct, 2018 15:36 IST|Sakshi
కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ (ఫైల్‌ఫోటో)

సాక్షి, న్యూడిల్లీ : అపరిమిత ముడి చమురు దిగుమతుల వల్లే భారత్‌ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని కేంద్ర రవాణా మంత్రి నితిన్‌ గడ్కరీ వ్యాఖ్యానించారు. రూపాయి క్షీణత, వాణిజ్య లోటు పెరగడంపై త్వరలో మంత్రుల బృందంతో భేటీ నేపథ్యంలో గడ్కరీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. భారత్‌ తన ఇంధన అవసరాల్లో 80 శాతం వరకూ విదేశీ మార్కెట్ల నుంచి దిగుమతులపైనే ఆధారపడటంతో పెద్దమొత్తంలో విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఖర్చవుతున్నాయి.

మరోవైపు డాలర్‌తో రూపాయి మారకం మరింత క్షీణించడంతో ఇంధన దిగుమతులపై అత్యధికంగా చెల్లింపులు అవసరమవుతున్నాయి. ముడిచమురు ధరలు ప్రస్తుతం బ్యారెల్‌కు 85 డాలర్లకు ఎగబాకాయి. ఇక రోజురోజూ భారమవుతున్న పెట్రోల్‌ ధరలు వరుసగా గురువారం సైతం పలు నగరాల్లో సామాన్యుడి జేబుకు చిల్లుపెడుతూ పైపైకి ఎగిశాయి. పెరుగుతున్న ఇంధన ధరలకు చెక్‌ పెట్టేందుకు పెట్రో ఉత్పత్తులపై సుంకాలు తగ్గించాలని, ఇంధన ధరలను జీఎస్టీ పరిధిలోకి తేవాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి.

మరిన్ని వార్తలు