సరి, బేసి విధానం అవసరం లేదు : గడ్కరీ

13 Sep, 2019 16:09 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని నివారించడానికి వాహనాలను సరి, బేసి సంఖ్యల ఆధారంగా రోడ్లపై అనుమతించే విధానం అవసరం లేదని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ స్పష్టం చేశారు. అంతకు ముందు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ మాట్లాడుతూ.. దీపావళి పండుగ సందర్భంగా వచ్చే కాలుష్యాన్ని తగ్గించడానికి నవంబర్‌ 4 నుంచి 15వ తేదీ వరకు సరి - బేసి విధానం అమలు చేస్తామని ప్రకటించారు. పెరిగిపోతున్న కాలుష్యానికి విరుగుడుగా వెయ్యి ఎలక్ట్రిక్‌ బస్సులను కొనుగోలు చేస్తున్నామని కేజ్రీవాల్‌ తెలిపారు. అయితే కేజ్రీవాల్‌ వ్యాఖ్యలతో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ విభేదించారు. ఢిల్లీలో సరి, బేసి విధానం సరికాదని అభిప్రాయపడ్డారు. తమ ప్రభుత్వం నిర్మించిన రింగ్‌రోడ్డు వల్ల ఇప్పటికే కాలుష్యం గణనీయంగా తగ్గిందని పేర్కొన్నారు. మరో రెండేళ్లలో కేంద్రం చేపట్టిన విధానాల ఫలితాలు వస్తాయని తెలిపారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించుకుంటే అది వారిష్టమని గడ్కరీ స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు