షెల్టర్‌ షేమ్‌పై స్పందించిన నితీష్‌ కుమార్‌

3 Aug, 2018 14:26 IST|Sakshi
బిహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ (ఫైల్‌ ఫోటో)

సాక్షి, పట్నా : ముజఫర్‌పూర్‌ షెల్టర్‌ హోంలో మైనర్‌ బాలికలపై లైంగిక దాడి దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన క్రమంలో ఈ దారుణ ఘటనపై బిహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ ఎట్టకేలకు స్పందించారు. ఈ ఘటనపై ప్రభుత్వం సిగ్గుపడుతోందని, బాధ్యులపై కఠిన చర్యలు చేపడతామని నితీష్‌ వ్యాఖ్యానించారు. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నామని, పట్నా హైకోర్టు విచారణను పర్యవేక్షించాలని తాను కోరుకుంటున్నానన్నారు.

ముజఫర్‌పూర్‌ ఘటనపై సుప్రీం కోర్టు బిహార్‌ ప్రభుత్వానికి నోటీసులు పంపడం, ఈ ఉదంతంపై పార్లమెంట్‌, బిహార్‌ అసెంబ్లీల్లో తీవ్ర దుమారం రేగిన క్రమంలో నితీష్‌ ఈ దారుణ ఘటనపై నోరుమెదపడం గమనార్హం. ముజఫర్‌పూర్‌లోని బాలికల వసతి గృహంలో మైనర్‌ బాలికలపై నిర్వాహకులు, అధికారులు లైంగిక దాడులు జరిపారని టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ చేపట్టిన సామాజిక ఆడిట్‌లో వెలుగుచూసిన విషయం తెలిసిందే.

వసతి గృహంలోని 34 మంది మైనర్‌ బాలికల్లో 29 మందిపై లైంగిక వేధింపులు జరిగాయని వైద్య నివేదికలు స్పష్టం చేశాయి. ఆరోపణల నేపథ్యంలో బాలికల వసతి గృహాన్ని బిహార్‌ ప్రభుత్వం బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది. కాగా షెల్టర్‌ హోం నిర్వాహకుడు బ్రజేష్‌ ఠాకూర్‌ సహా పలువురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

>
మరిన్ని వార్తలు