ఐదోసారి సీఎంగా నితీశ్ ప్రమాణం

21 Nov, 2015 01:54 IST|Sakshi
ఐదోసారి సీఎంగా నితీశ్ ప్రమాణం

బిహార్‌లో కొలువుదీరిన మహా సర్కారు
పట్నాలో అతిరథుల మధ్య అంగరంగ వైభవంగా కార్యక్రమం

 
లాలూ ఇద్దరు తనయులతో పాటు మొత్తం 28 మంది మంత్రులుగా ప్రమాణం
 
 పట్నా: బిహార్‌లో మహాకూటమి సర్కారు కొలువుదీరింది. రాజకీయ అతిరథులు, వివిధ రంగాల ప్రముఖుల సమక్షంలో ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ శుక్రవారం ప్రమాణం చేశారు. గవర్నర్ రామ్‌నాథ్ గోవింద్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ ఇద్దరు తనయులు తేజస్వి, తేజ్ ప్రతాప్‌లతోపాటు మొత్తం 28 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. కొత్త మంత్రుల్లో ఆర్జేడీ నుంచి 12 మంది, జేడీయూ నుంచి 12 మంది, కాంగ్రెస్ నుంచి నలుగురు ఉన్నారు.  నితీశ్ సీఎంగా ప్రమాణం చేయడం ఇది వరుసగా మూడోసారి. ఇప్పటివరకు మొత్తమ్మీద ఆయన ఐదుసార్లు సీఎంగా ప్రమాణం చేశారు.  243 మంది సభ్యులు గల అసెంబ్లీలో ఆర్జేడీకి 80, జేడీయూకు 71, కాంగ్రెస్‌కు 27 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. రాజ్యాంగం ప్రకారం అసెంబ్లీలోని మొత్తం సభ్యుల్లో మంత్రుల సంఖ్య 15 శాతానికి మించరాదు. ఈ లెక్కన బిహార్ కేబినెట్‌లో నితీశ్‌తో కలిపి 36 మందికి స్థానం లభిస్తుంది.

 అతిరథుల రాక..
 పట్నాలోని గాంధీ మైదాన్‌లో జరిగిన ఈ  కార్యక్రమానికి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్, మాజీ ప్రధాని దేవెగౌడ, పశ్చిమబెంగాల్ సీఎం మమత్జ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, సీపీఎం నేత సీతారాం ఏచూరి, సీపీఐ నేత డి.రాజాతోపాటుతోపాటు కాంగ్రెస్ సీఎంలు వీరభద్రసింగ్, ఊమెన్ చాందీ, గొగోయ్, సిద్ధరామయ్య, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా హాజరయ్యారు. ప్రధాని తరఫున కేంద్రమంత్రి వెంకయ్య వచ్చారు. సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం, యూపీ సీఎం అఖిలేష్ రాలేదు.

 అందరి చూపు లాలు కొడుకులపైనే
 ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వేలాది మంది జనం హాజరయ్యారు. ప్రమాణవేదికపై ఉన్న లాలు ఇద్దరు కొడుకులు తేజస్వి, తేజ్ ప్రతాప్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నితీశ్ ప్రమాణం చేసిన వెంటనే వీరిద్దరూ ప్రమాణం చేయడంతో ప్రభుత్వంలో లాలూ కుటుంబానికి ఉన్న ప్రాధాన్యం వెల్లడైంది. ప్రమాణం సమయంలో ఒక పదాన్ని తేజ్ ప్రతాప్ తప్పుగా ఉచ్ఛరిండంతో దాన్ని సరిగా అనాల్సిందిగా గవర్నర్ రెండోసారి ఆయనతో చెప్పించారు. అంతకుముందు లాలు కొడుకులిద్దరూ నితీశ్ కుమార్ పాదాలకు నమస్కరించి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి లాలూ రబ్రీ దేవి, ఏడుగురు కూతుళ్లు-అల్లుళ్లు అందరూ హాజరయ్యారు.
 
 ఆర్జేడీకి కీలక శాఖలు
 పట్నా: నితీశ్ మంత్రివర్గంలో సగం ప్రాతినిధ్యాన్ని సాధించిన ఆర్జేడీ, మంత్రిత్వ శాఖల విషయంలోనూ పైచేయి సాధించింది. అత్యంత కీలకమైన ఆర్థిక శాఖ ఆర్జేడీకి చెందిన అబ్దుల్ బరీ సిద్ధికీకి కేటాయించారు. ఇక ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన లాలూ ప్రసాద్ చిన్న తనయుడు తేజస్వి యాదవ్‌కు రహదారులు, భవనాల నిర్మాణ శాఖను కేటాయించారు. ఇక మరో తనయుడు తేజ్ ప్రతాప్ వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖను పొందారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు సంబంధించి హోం శాఖను నితీశ్ తనదగ్గరే ఉంచుకున్నారు.
 
 ‘12’వ నంబర్ ఆటగాడు!
 అగ్రశ్రేణి క్రికెటర్ కావాలని కలలు గన్న తేజస్విలో అంతటి ప్రతిభ ఎప్పుడూ లేవు. ప్రొఫెషనల్ క్రికెట్‌లో ఎట్టకేలకు అడుగు పెట్టి ‘మమ’ అనిపించుకున్నా...దాని వెనుక తండ్రి అండదండలే కారణమనేది బహిరంగ రహస్యం. పేరుకు బిహారీ అయినా, ఢిల్లీలో ఉండి జార్ఖండ్ జట్టు తరఫున అతను క్రికెట్ ఆడాడు. అండర్-19 స్థాయిలో ఢిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఒకే ఒక రంజీ మ్యాచ్ ఆడి 2 ఇన్నింగ్స్‌లలో కలిపి 20 పరుగులు చేశాడు. 2 వన్డేల్లో 14 పరుగులు చేసిన అతను ఒక వికెట్ పడగొట్టాడు. 4 టి20లలో ఒకే ఇన్నింగ్స్ ఆడి 3 పరుగులతో సరిపెట్టాడు.

మరిన్ని వార్తలు