కేంద్రానికి థ్యాంక్స్‌: సీఎం నితీశ్‌

4 May, 2020 14:10 IST|Sakshi
సీఎం నితీశ్‌కుమార్‌

పట్నా: కేంద్ర ప్రభుత్వానికి బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ ధన్యవాదాలు తెలిపారు. లాక్‌డౌన్‌తో ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న బిహారీలను తరలించడానికి ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయాలన్న తన సూచనను పాటించినందుకు సంతోషంగా ఉందన్నారు. శ్రామిక్‌ ప్రత్యేక రైళ్లలో బిహార్‌ వచ్చే వారు టిక్కెట్లకు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చే వారి కోసం క్వారంటైన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. 

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు క్వారంటైన్‌లో 21 రోజులు పాటు ఉండాల్సివుంటుందని సీఎం నితీశ్‌ స్పష్టం చేశారు. క్వారంటైన్ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లేటప్పుడు ప్రతి ఒక్కరికి బిహార్‌ ప్రభుత్వం వెయ్యి రూపాయల సహాయం అందజేస్తుందని చెప్పారు. ఈ పథకంలో కింద బిహార్‌లో ఇప్పటికే 19 లక్షల మందికి వెయ్యి రూపాయల చొప్పున ఇచ్చామని వెల్లడించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బిహారీలకు ఎటువంటి సమస్యలు రాకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. (వామ్మో.. ఇంత పేద్ద ‘బారా’)

యూపీని చూసి నేర్చుకోండి: బీజేపీ
కాగా, సొంత ప్రభుత్వంపై బీజేపీ నాయకుడు సంజయ్‌ జైశ్వాల్‌ విమర్శలు గుప్పించారు. లాక్‌డౌన్‌ 3.0 అమలు, వలసదారులను తిరిగి తీసుకువచ్చే రైళ్ల వివరాలపై నితీశ్‌ సర్కారుకు స్పష్టత లేదని ఫేస్‌బుక్‌లో విమర్శించారు. ఉత్తరప్రదేశ్‌ నుంచి బిహార్‌ పాఠాలు నేర్చుకోవాలని సలహాయిచ్చారు. బిహార్‌ ప్రభుత్వంలో భాగస్వామి అయిన బీజేపీ నుంచి విమర్శలు ఎదుర్కొవడం జేడీ(యూ) సర్కారు తలనొప్పిగా మారింది. (బీజేపీకి ఒక్క సీటు కూడా రాదు..)

మరిన్ని వార్తలు