కేరళ సీఎంతో ఎంపీ కవిత భేటీ

16 Feb, 2016 01:26 IST|Sakshi
కేరళ సీఎంతో ఎంపీ కవిత భేటీ

తిరువనంతపురం: పసుపునకు కనీస మద్దతు ధర కల్పించడం, పసుపు బోర్డు ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని నిజామాబాద్ ఎంపీ కవిత కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీని కోరారు. పసుపు రైతుల సంక్షేమం కోసం పసుపు బోర్డును జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయాలని, పసుపు మద్దతు ధరను కేంద్రం నిర్ణయించేలా ప్రధాని నరేంద్ర మోదీపై ఒత్తిడి తేవాలని విన్నవించారు. తిరువనంతపురంలోని సీఎం కార్యాలయంలో ఊమెన్ చాందీని కవితతో పాటు ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్దన్, విద్యాసాగర్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి కలసి ఓ లేఖ అందజేశారు.

'పసుపు రైతులకు అవసరమైన సౌకర్యాలు లేకపోవడం వలన కష్టాలు పడుతున్నారు. మద్దతు ధర లేకపోవడం వల్ల దళారీలు లాభపడుతున్నారు.  పసుపు రైతుల సమస్యల పరిష్కారం కోసం పసుపు బోర్డు ఏర్పాటు చేయాల్సిన అవసరముంది. పసుపును ప్రధానంగా ఆహారంలో, మందుల్లో, సౌందర్య సాధనాల్లో, హెయిర్ డై, వస్త్ర పరిశ్రమల్లో వాడుతున్నారు. విదేశాలకు అధికంగా ఎగుమతి అవుతున్న ఈ పంటకు మన దేశంలో కనీస మద్దతు ధర లేదు. పసుపు ప్రస్తుతం స్పైస్ బోర్డులో భాగంగా ఉంది. ఇది పసుపుతో పాటు దాదాపు ఇతర 54 పంటలను పర్యవేక్షిస్తోంది. అలా కాకుండా ఇప్పటికే ఉన్న పొగాకు, కాఫీ బోర్డుల వలే ఒక ప్రత్యేక బోర్డు పసుపు పంటకు ఉండడం అవసరం' అని లేఖలో పేర్కొన్నారు.

2014-15 సంవత్సరంలో కేరళ ప్రభుత్వం పసుపు రైతులకు హెక్టారుకు 12,500 రూపాయలను ఆర్థిక సహాయంగా అందించడంతో ఎర్నాకులం, మలప్పురం, కోజికోడ్, వాయనాడ్, కొల్లాం జిల్లాల పసుపు రైతులకు మేలు జరిగిందని కవిత ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు. బోర్డు ఏర్పాటు వల్ల కేరళకు చెందిన అల్లెప్పీ రకం పసుపు ఎగుమతులు పెరుగుతాయని కవిత చెప్పారు. కేరళ సీఎం ఊమెన్ చాందీ స్పందిస్తూ..  పసుపు పంటకు మద్దతు ధరను సాధించడం కోసం కేంద్రం పై సమష్టిగా ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు కోరుతూ తమ రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్రాన్ని కోరుతామని చెప్పారు. కవిత గతంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ లను కలసి పసుపు బోర్డు ఏర్పాటు చేసి, కనీస మద్దతు ధర కల్పించాలని కోరారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో కూడా సమావేశమయ్యారు.

మరిన్ని వార్తలు