ధ్వని కాలుష్యాన్ని గుర్తించే ఎన్‌ఎంసీల ఏర్పాటు

1 Sep, 2014 22:37 IST|Sakshi
ధ్వని కాలుష్యాన్ని గుర్తించే ఎన్‌ఎంసీల ఏర్పాటు

సాక్షి, ముంబై: గణేష్ ఉత్సవాల సమయంలో ధ్వని కాలుష్యాన్ని గుర్తించేందుకు మహారాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (ఎంపీసీబీ) రాష్ట్ర వ్యాప్తంగా 85 చోట్ల నాయిజ్ మానిటరింగ్ సెంటర్స్ (ఎన్‌ఎంసీ) ఏర్పాటు చేసింది. ఒక్క ముంబైలోనే  25 చోట్ల ఎన్‌ఎంసీలను ఏర్పాటు చేసింది.  ముంబైతోపాటు పుణేలో 12, కొల్హాపూర్-4, సంబాజీనగర్-4 ఇలా కీలక నగరాల్లో కూడా  ఏర్పాటు చేశారు. ముంబైలో గిర్గావ్ చౌపాటి, దాదర్, జుహూ చౌపాటి, ముంబెసైంట్రల్, పరేల్, చించ్‌పోక్లీ, బైకల్లా, బాంద్రా, ఖార్, శాంతాకృజ్, అంధేరి, కాందివలి, బోరివలి తదితర 25 ప్రాంతాల్లో ఎన్‌ఎంసీలను ఏర్పాటు చేశారు.
 
కాలుష్యం అంచనా
లౌడ్‌స్పీకర్లు, డీజే సౌండ్ సిస్టం, ఊరేగింపులో బ్యాండు, మేళతాళాలు, బాణసంచాలు కాల్చడం వల్ల ధ్వని కాలుష్యం విపరీతంగా పెరుగుతోంది. ధ్వని కాలుష్యాన్ని కొలిచే పనులు ఏటా ఎంపీసీబీ చేపడుతుంది. ఏ ప్రాంతంలో ఎంత మేర ధ్వని కాలుష్యం పెరిగింది..? ఎక్కడ తగ్గింది..? అనేది దీని ద్వారా తెలుస్తోంది. ఆ తర్వాత ఒక నివేదిక రూపొందిస్తారు. గణేష్ ఉత్సవాలు ప్రారంభమైన మొదటి రోజు ఎంత మేర ధ్వని కాలుష్యం జరిగిందో గుర్తించారు.

తర్వాత గురువారం జరిగే గౌరి, గణపతుల నిమజ్జం, చతుర్థి రోజున ఈ కాలుష్యాన్ని రీడింగ్ చేస్తారు. అనంతరం ప్రజలను జాగృతం చేసేందుకు ఎంపీసీబీ రూపొంధించిన నివేదికను ఆ బోర్డు వెబ్ సైట్‌లో ఉంచనున్నారు. ఎంపీసీబీ తయారు చేసిన ఈ నివేదిక వచ్చే ఏడాది ఉత్సవాల సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకునేందుకు పోలీసులకు  దోహదపడుతోందని ఎంపీసీబీ ప్రజాసంబంధాల అధికారి సంజయ్ భుస్కుటే  చెప్పారు.

మరిన్ని వార్తలు