‘కరుణ’కు వైగో షాక్

4 Nov, 2014 08:24 IST|Sakshi
‘కరుణ’కు వైగో షాక్

 సాక్షి, చెన్నై:డీఎంకే అధినేత ఎం.కరుణానిధికి ఎండీఎంకే నేత వైగో షాక్ ఇచ్చారు. కరుణ ఆహ్వానాన్ని తిరస్కరించిన వైగో, డీఎంకే కూట మిలో చేరబోనని, తనకు అలాంటి ఆలోచనే లేదని స్పష్టం చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేపట్టడమే లక్ష్యంగా కరుణానిధి పావులు కదుపుతున్నారు. తన నేతృత్వంలో మెగా కూటమి కసరత్తుల్లో మునిగారు. ఎండీఎంకే, డీఎండీకే, పీఎంకేలను తన వైపు తిప్పుకునేందుకు వ్యూహ రచనలో పడ్డారు.రెండు రోజుల క్రితం మహాబలి పురం వేదికగా జరిగిన పీఎంకే అధినేత రాందాసు ఇంట శుభకార్యాన్ని కరుణానిధి తనకు అనుకూలంగా మలుచుకునే యత్నం చేశారు. ఈ వేడుకలో డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్, ఎండీఎంకే అధినేత వైగోలు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకోవడం, ఇద్దరూ కలిసి మరుసటి రోజు ఒకే విమానంలో మదురైకు వెళ్లడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీంతో ఎండీఎంకే వస్తే ఆహ్వానించేందుకు తాను సిద్ధం అని కరుణానిధి సైతం ప్రకటించారు.
 
 దీంతో త్వరలో కరుణ నివాసం మెట్లు ఎక్కేందుకు వైగో సిద్ధం అవుతున్నట్టుగా తమిళ మీడియా కోడై కూసింది. రాందాసు ఇంటి వివాహ వేడుక తమకు కలిసి వచ్చినట్టుగానే ఉందన్న ఆనందంలో డీఎంకే వర్గాలు పడ్డాయి. అయితే, ఆ  ఆనందానికి, సాగుతున్న ప్రచారానికి ముగింపు పలుకుతూ వైగో స్పందించడం డీఎంకే వర్గాలకు షాక్ తగిలింది.కూటమిలో చేరబోను: ఈ రోడ్ జిల్లా ఎండీఎంకే కార్యదర్శి గణేష మూర్తి కుమారుడు కపిలన్ వివాహం దివ్యతో ఆదివారం జరిగింది. కాంగేయంలో జరిగిన ఈ వేడుకలో వధూవరులను ఆశీర్వదిస్తూ వైగో ప్రసంగించారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని వివరించారు. గతంలో తాను పాదయాత్ర చేస్తున్న సమయంలో అప్పటి సీఎం జయలలితను కలుసుకున్నానన్నారు. అంతమాత్రాన తాను అప్పట్లో అన్నాడీఎంకే కూటమిలో చేరలేదని గుర్తు చేశారు. తాను పాదయాత్రగా వెళ్తున్న వైపుగానే సీఎంగా ఉన్న జయలలిత కాన్వాయ్ వెళ్లిందని పేర్కొన్నారు.
 
  ఆ సమయంలో ఇద్దరం ఒకే మార్గంలో ఎదురు పడ్డామని, మర్యాద పూర్వకంగా పలకరించుకున్నామని చెప్పారు. ఇప్పుడు కూడా అదే జరిగిందంటూ స్టాలిన్‌ను కలుసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. రాందాసు ఇంటి వేడుకలో తనకు స్టాలిన్ ఎదురు పడ్డారని, అదే విధంగా ఆయనకు తాను ఎదురు పడ్డానని, ఇద్దరం మర్యాద పూర్వకంగా పలకరించుకున్నట్లు తెలిపారు. అంత మాత్రాన డీఎంకే కూటమిలో ఎండీఎంకే చేరినట్టు కాదని స్పష్టం చేశారు. ఇంకా చెప్పాలంటే, డీఎంకే కూటమిలోకి వెళ్లాలన్న యోచన తనకు ఇప్పటి వరకు లేదన్నారు. ఎన్నికలకు సమయం ఇంకా ఉందని, కూటమి విషయం అప్పడు చూసుకోవచ్చన్నారు. త న పార్టీని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తే మాత్రం తీవ్రంగా స్పందించాల్సి ఉంటుందని హెచ్చరించడం గమనార్హం. అలాగే, తాను మాత్రం డీఎంకే కూటమిలో చేరబోనని స్పష్టం చేశారు.
 

మరిన్ని వార్తలు