కాంగ్రెస్‌తో పొత్తు నో

13 Mar, 2019 02:49 IST|Sakshi

బీఎస్పీ అధినేత్రి మాయావతి వెల్లడి 

ఆమె మాకు అక్కర్లేదు: కాంగ్రెస్‌ స్పందన

న్యూఢిల్లీ/ లక్నో: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఏ రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు ఉండబోదని బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్‌ మినహా వివిధ రాష్ట్రాలకు చెందిన పార్టీ నేతలతో ఆమె మంగళవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాయావతి మాట్లాడుతూ.. బీఎస్పీతో జతకట్టడానికి చాలా పార్టీలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. రాజకీయ లబ్ధి కోసం, తమ పార్టీకి హాని కలిగే తీరుగా ఎలాంటి నిర్ణయం తీసుకోబోమని స్పష్టం చేశారు. యూపీలో ఎస్పీతో కలిసి పోటీచేయడంపై మాయావతి స్పందించారు. ఎస్పీతో బీఎస్పీ పొత్తు పరస్పర గౌరవం, నిజాయతీ ప్రాతిపదికన ఏర్పడిందని స్పష్టం చేశారు. యూపీలో ఎస్పీ–బీఎస్పీ కూటమి బీజేపీని కచ్చితంగా ఓడిస్తుందని వ్యాఖ్యానించారు.

నిర్ణయించాల్సింది మేమే: కాంగ్రెస్‌
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌తో ఏ రాష్ట్రంలోనూ పొత్తుపెట్టుకోబోమంటూ బీఎస్‌పీ అధినేత్రి మాయవతి చేసిన ప్రకటనపై యూపీ కాంగ్రెస్‌        ప్రతినిధి రాజీవ్‌ బక్షి స్పందించారు. ‘మాయావతితో మాకు అవసరమే లేదు. ఆమె పార్టీతో పొత్తుపై నిర్ణయించాల్సింది కాంగ్రెస్‌ పార్టీయే     తప్ప, మాయావతి కాదు’ అని వ్యాఖ్యానించారు. ‘ఆమె పార్టీకి పార్లమెంట్‌లో ఒక్క స్థానం కూడా లేదు. అలాంటిది, కూటమిలో చేరికపై ఆమె ఎలా నిర్ణయిస్తారు?. మేం యూపీలో ఒంటరిగానే బరిలోకి దిగుతాం. ఆమెతో పనిలేదు. కాంగ్రెస్‌ గురించి మాట్లాడేందుకు ముందుగా ఆమె వచ్చే 15, 20 రోజుల్లో చీలిపోనున్న కూటమి గురించి ఆలోచించుకోవాలి. చూడండి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయో’ అంటూ వ్యాఖ్యానించారు.  

మరిన్ని వార్తలు