ఆ టైమ్‌ దాటితే ఏటీఎంల్లో నగదు నింపరు..

19 Aug, 2018 16:51 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : నోట్ల రద్దుతో నగదు కోసం జనం పాట్లు మరువకముందే ఏటీఎంల్లో క్యాష్‌ దొరక్క ఇబ్బందులు ఎదుర్కోవడం రొటీన్‌గా మారింది. తాజాగా గ్రామీణ ప్రాంతాల్లో సాయంత్రం ఆరు దాటితే ఏటీఎంల్లో నగదు నింపరని, పట్టణ ప్రాంతాల్లో రాత్రి 9 తర్వాత ఏటీఎంలో నగదును నింపరని హోంమంత్రిత్వ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలు వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి అమల్లోకి రానున్నాయి. ఏటీఎంల్లో నగదును నింపే ప్రైవేట్‌ ఏజెన్సీలు ఆయా బ్యాంక్‌ల నుంచి ఉదయాన్నే నగదును సేకరించి సాయుధ వాహనాల్లో వాటిని తరలించి సాయంత్రం ఆరు లోగా గ్రామీణ ప్రాంతాల్లోని ఏటీఎంల్లో నింపాలని, నక్సల్‌ ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల్లోపే ఈ తతంగం పూర్తిచేయాలని హోంమంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్‌ పేర్కొంది.

నగదు వ్యాన్‌లపై దాడులు, ఏటీఎంల్లో అవకతవకలు చోటుచేసుకుంటున్న క్రమంలో తాజా ఉత్తర్వులు వెలువడ్డాయి. ఫిబ్రవరి 8 నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని అధికారులు పేర్కొన్నారు. ఇక ప్రతి క్యాష్‌ వ్యాన్‌కు డ్రైవర్‌తో పాటు ఇద్దరు సాయుధ సెక్యూరిటీ గార్డు, ఇద్దరు ఏటీఏం అధికారులు లేదా కస్టోడియన్స్‌ నగదు నింపే ప్రక్రియలో పాలుపంచుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఏటీఎం అధికారులను నేపథ్య పరిశీలన అనంతరమే నియమించుకోవాలని హోంమంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌లో పేర్కొంది. నగదు రవాణాకు భద్రతాధికారిగా మాజీ సైనికోద్యోగులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. క్యాష్‌ వ్యాన్‌లో ఐదు రోజుల రికార్డింగ్‌ సదుపాయంతో కూడిన  చిన్న సీసీటీవీ వ్యవస్థను నెలకొల్పాలని పేర్కొంది. క్యాబిన్‌ లోపల, బయట మూడు కెమేరాలను ఏర్పాటు చేయాలని సూచించింది. 

>
మరిన్ని వార్తలు