రంజాన్‌ నెల.. ‘ఆజాన్‌’పై నిషేధం లేదు..

24 Apr, 2020 18:05 IST|Sakshi
వీడియో దృశ్యాలు

న్యూఢిల్లీ : పవిత్ర రంజాన్‌ నెలలో నగరంలోని మసీదుల్లో ‘ఆజాన్‌’ ఇవ్వటంపై నిషేధం ఉందని వస్తున్న వార్తలను రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మనీష్‌‌ సిసోడియా కొట్టిపరేశారు. శుక్రవారం ట్విటర్‌ వేదికగా ఆయన స్పందిస్తూ.. మసీదుల్లో ‘ఆజాన్‌’పై ఎటువంటి నిషేధం లేదని స్పష్టం చేశారు. మసీదుల వద్ద నమాజు చేయటానికి జనాలు గుమిగూడటంపై పూర్తిస్థాయి నిషేధం ఉందని తెలిపారు. అంతకు క్రితం ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమానుతుల్లా ఖాన్‌ తన ట్విటర్‌ ఖాతాలో ఇందుకు సంబంధించిన ఓ వీడియోను విడుదల చేశారు. ‘‘ ఢిల్లీ మసీదుల్లో ఆజాన్‌ ఇవ్వకుండా చూసుకోవాలని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ పోలీసులను ఆదేశించారా?.. నేను ఈ విషయంపై ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌తో మాట్లాడతాన’’ని ట్వీట్‌ చేశారు. ( మాస్క్‌ ధరించిన ఉల్కపాతం! )

ఆ వీడియోలో.. వీధుల్లో నించుని ఉన్న పోలీసులు ఢిల్లీ మసీదుల్లో ఆజాన్‌ ఇ‍వ్వటంపై నిషేదం ఉందని అక్కడి వారికి చెబుతారు. దీనిపై స్పందించిన ఓ మహిళ .. ఆజాన్‌ లేకపోతే రంజాన్‌ నెలలో జరుపుకునే ఉపవాసం దీక్షను ఎలా విరమిస్తామని ప్రశ్నిస్తుంది. దీనికి పోలీసులు జవాబిస్తూ.. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ను ప్రశ్నించమని అంటారు. అయితే అమానుతుల్లా ఖాన్‌ విడుదల చేసిన ఈ వీడియో ఢిల్లీలోని ఏ ప్రాంతంలో, ఎప్పుడు జరిగిందన్నది తెలియరాలేదు.

>
మరిన్ని వార్తలు