అక్కడ బీఫ్‌ లేదు.. వారికి బెయిల్‌!

17 Mar, 2016 12:16 IST|Sakshi
అక్కడ బీఫ్‌ లేదు.. వారికి బెయిల్‌!

జైపూర్‌: రాజస్థాన్‌లోని మేవాడ్‌ యూనివర్సిటీలో తలెత్తిన బీఫ్ వివాదం సద్దుమణుగుతోంది. యూనివర్సిటీలోని తమ హాస్టల్ గదిలో ఆవుమాంసం వండుకొని తిన్నారనే ఆరోపణలతో అరెస్టయిన నలుగురు కశ్మీరీ విద్యార్థులకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆ విద్యార్థులు వండుకొని తిన్న మాంసం బీఫ్ కాదని నిపుణులు నిర్ధారించడంతో చిత్తర్‌గఢ్‌లోని సబ్ డివిజినల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టుకు వారికి బెయిల్‌ మంజూరు చేసింది.

మేవాడ్‌ వర్సిటీ డిగ్రీ చదువుతున్న కశ్మీరీ విద్యార్థులు షకీబ్ అష్రఫ్‌, హిలాల్ ఫరుఖ్, మహమ్మద్ మక్బూల్, షౌకత్ అలీ తమ హాస్టల్ గదిలో బీఫ్ వండుకున్నారని వదంతులు రావడం క్యాంపస్‌లో ఉద్రిక్తతలు సృష్టించింది. ఈ వదంతులతో కొందరు విద్యార్థులు, స్థానికులు కలిసి వారిని చితకబాదారు. ఆ విద్యార్థులపై చర్య తీసుకోవాలని మరికొందరు యూనివర్సిటీ ముందు ఆందోళన నిర్వహించారు. మేవాడ్‌ యూనివర్సిటీకి 100శాతం శాఖాహార విశ్వవిద్యాలయంగా పేరొంది. ఈ నేపథ్యంలో 21 నుంచి 27 ఏళ్ల మధ్య వయస్సున్న ఆ నలుగురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే స్థానికంగా లభించే 300 గ్రాముల మాంసాన్ని తెచ్చుకొని.. వారు వండుకున్నారని పోలీసులు విచారణలో ధ్రువీకరించారు. అయితే, ఆ విద్యార్థులు తెచ్చుకున్న మాంసం బీఫ్ కాదని నిపుణులు తేల్చారు.
 

మరిన్ని వార్తలు